telugu navyamedia
సినిమా వార్తలు

నీతి , నిజాయితీ , నిబద్దత కలిగిన అరుదైన జర్నలిస్ట్ వాసుదేవ దీక్షితులు

Nirvana, realistic, authentic journalist of Vasudeva
వృత్తి లో నిబద్దత, నిజాయితీ ,  అంకితభావం కలిగిన జర్నలిస్టుల్లో నిస్సందేహంగా వాసుదేవ దీక్షితులు గారు ముందు వరుసలో వుంటారు . వాసుదేవ దీక్షితులు గారితో నాకు ప్రత్యేక అనుబంధం వుంది . నిజంగా అది ఎప్పటికీ మిగిలిపోయేదే . జర్నలిస్ట్ గా తనదైన ముద్రను తెలుగు పత్రికా రంగం మీద వేసి శాశ్వతంగా నిష్క్రమించిన అరుదైన పాత్రికేయుడు వాసుదేవ దీక్షితులు గారు . శుక్రవారం నాడు హైద్రాబాద్ లో తన 76వ ఏట  మరణించిన వాసుదేవ దీక్షితులు  వృత్తి  జీవితం;లో అలుపెరుగని కలం యోధుడు . 
జర్నలిస్టుగా రాజీపడిన సందర్భాలను నేను చూడలేదు . ఆంధ్ర ప్రభ తో ఆయన అనుబంధం విడతీయలేనిది . 1942 ఫిబ్రవరి 15న కోనసీమలో జన్మించిన దీక్షితులు గారు డిగ్రీ తరువాత కొంత కాలం పూణే లోని డిఫెన్స్ లో పనిచేశారు . ఆ తరువాత 1967లో ఆంధ్ర ప్రభ దిన పత్రికలో సబ్ ఎడిటర్ గా జాయిన్ అయ్యారు . ఆంధ్ర ప్రభలో అంచెలంచెలుగా ఎదిగి ఒదిగిన గొప్ప జర్నలిస్ట్ దీక్షితులు . 1993లో ఆంధ్ర జ్యోతి లో నేను వుద్యోగం మానేసిన  ఖైరతాబాద్ లో డిటిపి  సెంటర్ పెట్టాను . అప్పుడు వాసుదేవ దీక్షితులు గారితో పరిచయం ఏర్పడింది . 
Nirvana, realistic, authentic journalist of Vasudeva
ఆంధ్ర ప్రభ నుంచి వెలువడే ఆదివారం , చిన్నారి మొదలైన పత్రికలకు డిటిపి వర్క్ చేసేవాళ్ళం . ఆ సందర్భంగా అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాడిని . 1996లో ప్రియమైన శ్రీవారు సినిమా నిర్మాణం , ఆ తరువాత నజరానా టెలి ఫిలిం ప్రారంభోత్సవానికి దూరదర్శన్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు , దీక్షితులు గారిని ఆహ్వానించాను . ఆ తరువాత  డిటిపి నష్టం రావడంతో దాన్ని క్లోజ్ చేశాను .అప్పుడు ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు . ఒకరోజు ఆంధ్ర ప్రభ సండే మ్యాగజిన్ ఎడిటర్ విజయ బాబు గారితో మాట్లాడుతూ … “ఉద్యోగం  కోసం చూస్తున్నా ” అన్నాను . అప్పుడు ఆంధ్ర ప్రభలో సినిమా చూసేవారు లేరు . “ఆంధ్ర ప్రభలో మీరెందుకు జాయిన్ కాకూడదు ?” అని అడిగారు . 
“తప్పకుండా “అని చెప్పాను . 
అప్పటికప్పుడు విజయ బాబు నన్ను వాసుదేవ దీక్షితులు గారి గదిలోకి తీసుకెళ్లి విషయం చెప్పారు .మొదట్లో ఆయన నమ్మలేదు . “బ్రదర్ మీరు నిజమే చెబుతున్నారా ? మా దగ్గర చేరతారా ?” అని అడిగారు ఆశ్యర్యంగా . “నిజంగానే చేరతాను సర్ , మీరు అవకాశం ఇస్తే అన్నాను “నిజానికి నాకు అప్పుడు ఉద్యోగంచెయ్యాల్సిన  అవసరం చాలా వుంది . అప్పటికప్పుడు తన గదిలో వున్న క్యాలెండరు చూసి “ఫలాని రోజు బాగుంది చేరిపో బ్రదర్ ” అని షేక్ హ్యాండ్ ఇచ్చారు . 
Nirvana, realistic, authentic journalist of Vasudeva
అలా నేను ఆంధ్ర ప్రభలో చేరి సినిమా పేజీ ఇంచార్జి గా పనిచేయ సాగాను . ఆయనకు సినిమా అంటే వల్లమాలిన ప్రేమ. నాకు వీలున్నప్పుడల్లా అయన గదికి వెళ్లి మాట్లాడుతూ ఉండేవాడిని . దీక్షితులుగారు ఒక జర్నలిస్టుగా కాకుండా  ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుగా ట్రిమ్ముగా ఉండేవారు . మడత నలగని బట్టారు , అందంగా వుండే క్రాపు , పెదవిపై చిరు నవ్వుతో చాలా సౌమ్యంగా కనిపించేవారు . 
ఆయన ఎడిటోరియల్ అంటే చాలా మంది ఇష్టపడేవారు . ఆయన ఎంచుకునే సబ్జెక్టు , ఆయన శైలి విభిన్నంగా ఉండేవి . 
ఎడిటోరియల్ లో తానూ చెప్పదల్చుకున్న విషయాన్ని సూటిగా , ఘాటుగా చెప్పేవారు . 
చాలా సందర్భాల్లో చాలా మంది నొచ్చుకున్న దాఖలాలు కూడా వున్నాయి . అయినా అయన ఎంచుకున్న మార్గాన్ని వదిలి రాజీపడేవారు కాదు . ఇక ఆయన ఎడిటోరియల్ రాస్తున్నాడు అంటే ఆయన గాడి ముందు ఎర్ర లైట్ వెలుగుతూ ఉండేది . ఆ సమయంలో ఎంత అర్జెంటు పని వున్నా ఆయన్ని డిస్టర్బ్ చేసేవారు కాదు . అంతటి దీక్షతో , అంకిత భావతో ఎడిటోరియల్స్ వ్రాసేవారు . 
ఎడిటోరియల్ వ్రాసిన తరువాత అప్పుడప్పుడు నన్ను పిలిచేవారు . పాత నటీనటులు గురించి మాట్లాడుతూ ఉండేవారు . ఆయన సినిమా పరిజ్ఞానం చూసి నాకు చాలా ఆశ్చర్యమేసేది . నేను ఆంధ్ర ప్రభ దిన పత్రికలో సినిమా పేజీ చూసేవాడిని . ప్రతివారం శుక్రవారం 4 పేజీల సినిమా అనుబంధం “చిత్రలేఖ ” వచ్చేది . దీనిని కూడా నేనే చూసేవాడిని . మంచి ఆర్టికల్ , లేదా ఇంటర్వ్యూ వచ్చినప్పుడు పిలిచి అభినందించేవారు . 
ఒకరోజు తన గదిలోకి పిలిచి ” సినిమాలంటే వున్న ప్రేమతో నటించాలని మద్రాస్ వెళ్లానని ,  . కొంతకాలం మద్రాస్ లో ఉన్నానని ఆ తరువాత కారణాంతరాల వాళ్ళ తిరిగి వచ్చానని “చెప్పారు  . అప్పుడు నాకు అర్ధమైంది . ఆ తరువాత ఒకరోజు నన్ను తన గదికి పిలిచారు . మంచి కఫ తెప్పించారు . అప్పుడు మొదలు పెట్టారు “మిత్రమా నీ గురించి నాకు తెలుసు .. సినిమా రంగంలో జర్నలిస్టుగా నీకు ఎంత గౌరవం ఉందొ ? నిజాయితీగా పనిచేయడం వల్ల  నిన్ను అందరు అభిమానిస్తారు . జర్నలిస్టుగా నువ్వేమిటీ అనేది నాకు తెలుసు . నువ్వు ఆంధ్ర ప్రభలోకి వస్తానని అన్నప్పుడు నేను చాలా సంతోషించాను . మన ఇద్దరం కల్సి సినిమా రంగానికి ఏదైనా చెయ్యాలి ” అన్నారు 
Nirvana, realistic, authentic journalist of Vasudeva
“తప్పకుండా సర్” అన్నాను . ఆ తరువాత రూపుదిద్దుకున్నదే “మోహిని “. దీనికి సంబందించిన వర్క్ ఒక సంవత్సర కాలం పట్టింది . 1998 లో మొదలైన మోహిని పుస్తకం పని 1999 లో పూర్తయ్యింది . దీనిని రెండు భాగాలుగా తీసుకు వచ్చాము . దీని కోసం ఇద్దరు జర్నలిస్టులను  మద్రాస్ పంపించి ఇంటర్వ్యూ లు , ఆర్టికల్స్  వ్రాయించారు . హైదరాబాద్ సినిమా పరిశ్రమ గురించిన వ్యాసాలూ , ఇంటర్వ్యూ లు నేను వ్రాశాను . తెలుగు సినిమా మీద ప్రత్యేక సంచిక అనగానే సహజంగా సినిమా కలసి వచ్చే పేరు , అగ్ర నటుల ఫోటో లతో కవర్ పేజీ వేస్తారు . అయితే దీక్షితులు గారు అందుకు భిన్నంగా ఈ స్పెషల్ ఇష్యూ కు “మోహిని ” అనే పేరు పెట్టారు . ఇక కవర్ పేజీ ఫోటో కోసం ఒకప్పటి గ్లామర్ స్టార్ కాంచన మాలను ఎంపిక చేశారు . 
ఇక ఇందులో దాదాపు ప్రతి ఆర్టీసీల , లేదా ఇంటర్వ్యూ కు హెడ్డింగ్ ఆయనే పెట్టారు . అవసరం అనుకున్నప్పుడు ఆర్టికల్ కు ముందు ఒకటో రెండో పేరాలు పరిచయం వ్రాసేవారు . అలా ప్రతి సందర్భంలోను మోహిని ప్రత్యేక సంచికను రూపు దిద్దడంలో దీక్షితులు గారి పాత్ర వుంది . మోహిని ప్రత్యేక సంచికలు తెలుగు సినిమాకు అపురూపమైన కానుకలు . నేను ఆంధ్ర ప్రభలో పనిచేసున్నప్పుడు 1997లో , 2000లో రెండు సార్లు నన్ను ఉత్తమ సినిమా విమర్శకుడిగా నంది అవార్డులు వచ్చాయి . ఆయా సందర్భాల్లో దీక్షితులు గారు ఎంతో సంతోషించారు . 
మోహిని అయిపోయిన కొంత కాలానికే మేనేజిమెంతో వచ్చిన విభేదాలతో ఉద్యోగ జీవితంలో రాజీపడలేక అంధ ప్రభ ను వదిలి పెట్టారు .  చాలా కాలం ఆయన ఖాళీగా వున్నారు . జర్నలిస్టుగా జీతం తప్ప మరోటి తెలియని దీక్షితులు గారు  సికిందరాబాద్ నగరానికి దూరంగా ఇల్లు కట్టుకున్నారు ఆంధ్ర ప్రదేశ్ ప్రదేశ్ ప్రభుత్వం ఆయన్ని ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నియమించింది . అప్పుడు వెళ్లి ఆయన్ని కలసి అభినందించాను . మరో సందర్భంలో నేను నవ్య మీడియా డైరెక్టర్ కాకాని బ్రహ్మం , సీనియర్  జర్నలిస్టు ఉడయవర్లు  గారు దీక్షితులు గారి నివాసానికి వెళ్లి రెండు గంటలపాటు అనేక విషయాలు చర్చించాము . . 
ఆరోగ్యంగా వున్న వాసుదేవ దీక్షితులు ఆకస్మికంగా  మృతి చెందడం నిజంగా పత్రికా రంగానికి తీరని లోటు .  తెలుగు పత్రికా రంగంలో వాసుదేవ దీక్షితులు స్మృతి  ఎప్పటికీ ఉంటుంది . 
– భగీరథ 

Related posts