ముగిసిన సోనియా గాంధీ ఈడీ విచారణ..
నేషనల్ హెరాల్డ్ కేసులో విచారించిన ఈడీ..
నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం మూడు గంటల పాటు ప్రశ్నించింది. ఈ కేసులో ఇప్పటికే రెండు రోజులు సోనియాను విచారించిన ఈడీ.. బుధవారం కేసుకు సంబంధించి మరిన్ని ప్రశ్నలు సంధించింది.
అయితే నేటితో ఆమె విచారణ ముగిసినట్లే తెలుస్తోంది. మరోసారి విచారణకు హాజరు కావాలని సోనియాకు కొత్తగా సమన్లు జారీ చేయలేదు.
ఈడీ కార్యాలయానికి ఉదయం 11 గంటలకు సోనియా గాంధీ చేరుకున్నారు. కుమార్తె ప్రియాంకా గాంధీ, కుమారుడు రాహుల్ గాంధీ ఆమె వెంట వెళ్లారు. 11.15 గంటలకు ఈడీ విచారణ ప్రారంభమైంది. కేసు విచారణ జరుపుతున్న కీలక అధికారి.. సోనియాను ప్రశ్నలు అడిగారు. మరో అధికారి ఆమె చెప్పిన సమాధానాలను రాసుకున్నారు

మధ్యాహ్నం 2 గంటలకు భోజన విరామం కోసం సోనియా ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. మధ్యాహ్నం 3.30కి మరోసారి రావాలని అధికారులు తొలుత సమాచారం ఇచ్చారు. అయితే, విచారణ ముగిసిందని, ప్రస్తుతానికైతే ఈడీ కార్యాలయానికి రావాల్సిన పని లేదని పేర్కొన్నారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని సోనియాకు చెప్పినట్లు సమాచారం.
సోనియాను ఇప్పటివరకు 95 నుంచి 110 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన సోనియా.. మరికొన్నింటికి తనకు తెలియవని చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
మరోవైపు సోనియా గాంధీ ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసనకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంట్ సమీపంలోని విజయ్ చౌక్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే తనతో సహా మొత్తం 65 మంది ఎంపీలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ పేర్కొన్నారు. తమను ఎటో గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్తున్నారని ట్వీట్ చేశారు


ఆ కథనం ప్రసారం చేసినందుకే.. ప్రభుత్వం నన్ను టార్గెట్ చేసింది