telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“మా”లో ముదిరిన ముసలం… నరేశ్ ను అధ్యక్షుడిగా తొలగించబోతున్నారా ?

MAA

ఇటీవల ఎంతో ఉత్కంఠగా జరిగిన “మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్)” ఎన్నికల్లో శివాజీరాజా ప్యానెల్‌పై వీకే నరేశ్ ప్యానెల్ విజయం సాధించిన విషయం తెలిసిందే. మార్చి 11న “మా” నూతన కార్యవర్గం కొలువుదీరింది. అధ్యక్షుడిగా వీకే నరేశ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా రాజశేఖర్, ప్రధాన కార్యదర్శిగా జీవిత, ఉపాధ్యక్షులుగా హేమ, ఎస్వీ కృష్ణారెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా గౌతంరాజు, శివబాలాజీ, కోశాధికారిగా రాజీవ్ కనకాల నియమితులయ్యారు. అయితే కొత్తకార్యవర్గం కొలువుదీరి ఆరు నెలలు ముగియగానే “మా”లో ముసలం మొదలైంది. ఇందుకు మంగళవారం జరిగిన కార్యవర్గ సమావేశం వేదిక అయింది. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ అధ్యక్షతన మంగళవారం “మా” కార్యవర్గ సమావేశం జరిగింది. “మా” నూతన కార్యవర్గం ఏర్పడి ఆరు నెలలు ముగిసినా ఇప్పటి వరకూ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అధ్యక్షుడిగా ఉన్న నరేశ్ సొంత పనులతో బిజీగా ఉండడం వల్ల “మా”ను పట్టించుకోవడం లేదని, అసలు ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమమూ మొదలు పెట్టని నరేశ్.. రూ. 20 లక్షలు దేనికి ఖర్చు చేశారని రాజశేఖర్ ప్రశ్న లేవనెత్తారు. నరేశ్‌కు అధ్యక్షుడిగా పని చేసే ఆసక్తి లేకపోతే దిగిపోవాలని సూచించారు. “మా” అధ్యక్షుడిగా ఉన్న నరేశ్.. తనను గెలిపించిన ఆర్టిస్టుల కోసం ఏ పని చేయకుండా సొంత పనులు చూసుకుంటూ బిజీగా ఉంటే ఎలా అని కార్యవర్గ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. “ఆయనా పనులు చేయకా.. మనల్నీ పని చేయించక ఉంటే ‘మా’కే చెడ్డ పేరు వస్తుంది. వ్యక్తిగత పనులతో బిజీగా ఉన్న నరేశ్‌ను ఏం చేద్దాం? అధ్యక్షుడిగా కొనసాగిద్దామా?.. లేక పదవి నుంచి తొలగిద్దామా?” అంటూ కార్యవర్గ సభ్యులను ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ ప్రశ్నించారు. నరేశ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించే విషయంపై సభ్యుల అభిప్రాయం తీసుకున్నారు. అధ్యక్షుడిని డైరెక్ట్‌గా తీసేయడం కుదరదు కనుక.. చట్టపరంగా షోకాజ్ నోటీసులు ఇవ్వాలనే ఏకాభిప్రాయానికి వచ్చారు. అయితే ఈ విషయంపై నరేశ్ ఎలా స్పందిస్తరనే దానిపై విషయమై “మా”లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Related posts