telugu navyamedia
సినిమా వార్తలు

“జెర్సీ” మా వ్యూ

Jersey

బ్యానర్ : సితార ఎంటర్టైన్మెంట్స్
నటీనటులు : నాని, శ్రద్ధ శ్రీనాథ్, సత్యరాజ్
దర్శకత్వం : గౌతమ్ తిన్ననూరి
నిర్మాత : సూర్యదేవర నాగవంశీ
సంగీతం : అనిరుధ్ రవిచంద్రన్
ఎడిటింగ్ : నవీన్ నూలి

గత కొంత కాలంగా న్యాచురల్ స్టార్ నానికి సరైన హిట్ రాలేదు. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని సరికొత్తగా స్పోర్ట్స్ డ్రామాను ఎంచుకుని ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా నాని నటించిన స్పోర్ట్స్ డ్రామా “జెర్సీ” సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇప్పటికే ప్రదర్శితమైన ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే ఈరోజు థియేటర్లలోకి వచ్చిన “జెర్సీ” ప్రేక్షకులను ఎంతమేరకు ఆకట్టుకుందో చూద్దాము.

కథ :
అర్జున్ (నాని)కు క్రికెట్ అంటే ప్రాణం. అతను సారా (శ్రద్దా శ్రీనాధ్) అనే ఓ క్రిష్టియన్ అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ సారా కుటుంబం వీరి పెళ్ళికి ఒప్పుకోకపోవటంతో… పెద్దల అనుమతి లేకుండానే పెళ్ళి చేసుకుంటాడు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అర్జున్ క్రికెట్ ఆడటం మానేస్తాడు. తన భార్య సంపాదనతో బ్రతుకుతూ సంపాదన లేక ఆర్ధిక సమస్యతో, తాను అనుకున్న కెరీర్ దొరక్కపోవడంతో నిరాశలో కురుకుపోతాడు అర్జున్. ఈ క్రమంలోనే వాళ్లకో పుడతాడు. అబ్బాయి పేరు నాని. వాడు కూడా క్రికెట్ అభిమానే. బాబు పుట్టాక వాడే లోకంగా బ్రతుకుతాడు అర్జున్. తన కొడుకు పుట్టిన రోజుకు గిప్ట్ గా ఓ ఐదు వందలు పెట్టి క్రికెట్ జెర్సీ కొనలేకపోవటం అతన్ని బాధిస్తుంది.

దాంతో తన కొడుక్కి జెర్సీని గిప్ట్ గా ఇవ్వటం కోసం ఓ ఛారిటీ తరఫున దాదాపు పదేళ్ల తర్వాత ఆడటానికి సిద్దపడతాడు. ఆ ఆటలో అర్జున్ అద్బుతంగా ఆడతాడు. కానీ గేమ్ లో ఓడిపోతాడు. దీంతో కొడుక్కు గిఫ్ట్ కొనివ్వలేకపోతాడు. అయితేనేం ఆ ఆట అతనిలో తిరిగి ఉత్సాహాన్ని నింపడమే కాకుండా తనలో సత్తా ఇంకా మిగిలే ఉందనే ధైర్యం వస్తుంది. అప్పటికి అర్జున్ కు 36 ఏళ్లు వచ్చేసాయి. అయినా సరే మళ్లీ క్రికెటర్ గా ఫీల్డ్ కు వెళ్ళి ఇండియన్ క్రికెట్ టీమ్ తరుపున ఆడాలని నిర్ణయించుకుంటాడు. అక్కడ నుంచి మళ్ళీ అర్జున్ జీవితానికో లక్ష్యం ఏర్పడుతుంది. మరి అర్జున్ ఆ లక్ష్యాన్ని చేరుకోగలిగాడా ? లక్ష్యాన్ని చేరుకునే దారిలో ఆయనకు ఎదురైన సమస్యలు, అవమానాలు, అనుభవాలు ఏంటన్న విషయం తెలియాలంటే సినిమాను వెండితెరపై వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :
అర్జున్ పాత్రలో నాని జీవించేశాడు. మనం తెరపై నాని యాక్టింగ్ కాదు అర్జున్ జీవితాన్ని మాత్రమే చూస్తాము. అంతలా ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేశాడు నాని. పక్కా ప్రొఫెషనల్ క్రికెటర్ గా నాని కనిపించిన విధానం అద్భుతం. కథ కన్నా నాని నటనకు వంద మార్కులు వేయాల్సిందే. ఇక క్రికెటర్ కు లవర్ గా, అర్జున్ కు భార్యగా శ్రద్ధ శ్రీనాథ్ కూడా బాగా నటించింది. సినిమాకు సత్యరాజ్ నటన హైలెట్. బ్రహ్మాజీ, సుబ్బరాజ్, రాహుల్ రామకృష్ణ, సంపత్ రాజ్, ప్రవీణ్, రోనిత్ కమ్ర (సినిమాలో నాని కొడుకు) తదితరులు తమ పరిధిమేర నటించి ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు :
సినిమాలో దర్శకుడి పూర్తి ప్రతిభ కన్పిస్తుంది. మిడిల్ క్లాస్ వ్యక్తి లైఫ్ లో ఎదుర్కొనే సమస్యలను, మళ్ళీ తనను తాను ప్రూవ్ చేసుకునే ఆత్మస్థైర్యాన్ని తనదైన శైలిలో తెరపై చూపించి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయం సాధించాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా సాగినా సెకండ్ హాఫ్ మళ్ళీ మంచి మూడ్ లోకి తీసుకెళుతుంది. ఒక ఆటలో మనిషి ఒడిపోతూనే జీవితంలో కూడా ఎదురుదెబ్బలు తినడం వంటి విషయాలను దర్శకుడు అద్భుతమైన స్క్రీన్ ప్లే తో చూపించాడు. తండ్రి కొడుకుల మధ్య జరిగే భావోద్వేగ యుద్ధం సరికొత్తగా ఉంటుంది. వింటేజ్ సెట్స్ లలో దర్శకుడు లైవ్ క్రికెట్ చూపించడాని చెప్పవచ్చు. అనిరుధ్ ఇచ్చిన సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింట్. కెమెరా పనితనం అద్భుతం. నిర్మాణ విలువలు బాగున్నాయి.

రేటింగ్ : 3/5

Related posts