ఆంధ్రప్రదేశ్లో తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటైంది. తిరుపతిలో వేయి కోట్ల రూపాయలతో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థ ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. తిరుపతి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం వర్చువల్ గా ప్రారంభించారు.
ఈ ప్లాంట్ ద్వారా ఏడాదికి 25 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్, రాక్మ్యాన్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ను ప్రారంభించినట్లు చంద్రబాబు తెలిపారు.
పారిశ్రామిక అవసరాల కోసం గ్రీన్ హైడ్రోజన్ను ఎల్పీజీ, పీఎన్జీలతో సమ్మిళితం చేసి అందించనున్నట్లు వివరించారు. పరిశ్రమలలో కర్భన ఉద్గారాలను తగ్గించడంలో ఇదెంతో సహాయపడుతుందని చంద్రబాబు తెలిపారు.
ఈ ప్రాజెక్టు విజయవంతం అయితే గ్లాస్, స్టీల్, పెట్రో కెమికల్స్, కెమికల్స్ ఇండస్ట్రీలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు.
అలాగే భారత దేశం హరిత ఇంధన విప్లవంలో భాగంగా స్వర్ణాంధ్ర విజన్ 2047 నిబద్ధతను తెలియజేస్తుందని తెలిపారు. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కీలకమైన ముందడుగుగా చంద్రబాబు అభివర్ణించారు.
వచ్చే ఐదేళ్లలో 10 ట్రిలియన్ల పెట్టుబడులను ఆకర్షించేందుకు అలాగే 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించేందుకు ఇది ఉపయోగపడుతుందని చంద్రబాబు ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతం, పోర్టులు, లాజిస్టిక్ నెట్వర్క్, పారిశ్రామిక వర్గాలకు అనుకూలమైన విధానాలు ఇందుకు ఉపయోగపడతాయని చంద్రబాబు పేర్కొన్నారు.

