telugu navyamedia
సినిమా వార్తలు

ఎన్ .టి .ఆర్ , ఏ .ఎన్. ఆర్ ను మొదటిసారి కలిపింది కృష్ణవేణిగారే.

“1936లో సి .పుల్లయ్య గారు బాల నటిగా ‘అనసూయ’ సినిమా ద్వారా కృష్ణవేణి గారిని పరిచయం చేశారు. 1938లో ద్రోణంరాజు కామేశ్వర రావు దర్శకత్వం వహించిన ‘కచదేవయాని’ సినిమాలో కథానాయికగా నటించారు. ఆ తరువాత 1939లో మీర్జాపురం జమీందారు మేకా వెంకటరామయ్య అప్పారావు బహదూర్ వారిని వివాహం చేసుకున్నారు. అదే ఆమె జీవితాన్ని అనూహ్యమైన మలుపు తిప్పింది ” అని భగీరథ చెప్పారు .

కృష్ణవేణి గారు డిసెంబర్ 24, 1924న రాజమండ్రిలో జన్మించారు. రేపు కృష్ణవేణి గారి 100వ జన్మదినోత్సవాన్ని ఆకృతి సంస్థ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరుపబోతుంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో భగీరథ మాట్లాడుతూ , 1936 నుంచి 1956 వరకు 20 సంవత్సరాల్లో 15 చిత్రాల్లో మాత్రమే నటించారు . అయినా ఆమె తెలుగు సినిమా రంగంపై చెరిగిపోని ముద్ర వేశారు.

1949 ఫిబ్రవరి 19న అక్కినేని, అంజలి నటించిన ‘ కీలు గుర్రం’ సినిమాను నిర్మించి, దర్శకత్వం వహించింది కృష్ణ వేణి గారి భర్త మీర్జాపురం రాజా వారే. ఈ సినిమాతో అక్కినేని నాగేశ్వర రావు గారికి స్టార్ స్టేటస్ వచ్చింది.
అదే సంవత్సరం ఎల్.వి ప్రసాద్ .గారి దర్శకత్వంలో వచ్చిన ‘మనదేశం’ సినిమాలో ఎన్ .టి. రామారావు గారిని పరిచయం చేసింది నిర్మాత కృష్ణవేణి , ఆమె భర్త మీర్జాపురం రాజా గారు. ఈ సినిమా 24 నవంబర్ 1949లో విడుదలైంది .

బి. ఏ .సుబ్బారావు, మీర్జాపురం రాజా వారు సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘పల్లెటూరు పిల్ల’ . ఇందులో నందమూరి తారక రామా రావు, అక్కినేని నాగేశ్వర రావు తొలిసారి కలసి నటించారు . బి . ఏ. సుబ్బారావు దర్శకత్వం వహించిన ఈ సినిమా 17 ఏప్రిల్ 1950లో విడుదలయ్యింది.

అలా ఇద్దరు మహా నటులు తొలిసారి కలసి నటించిన సినిమాను నిర్మించింది కృష్ణవేణి గారేనని , ఆమె 100 వ పుట్టినరోజు జరపడం ఎంతో సంతోషంగా , సముచితంగా ఉందని భగీరథ తెలిపారు . తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ , ఇవ్వాళ మన మధ్య కృష్ణ వేణి గారు ఉండటం మన అదృష్టం , ఇద్దరు మహా నటులు తొలిరోజుల్లో ఆమె నిర్మించిన సినిమాల్లో నటించారు . ఆమె మీర్జాపురం జమిందారును వివాహం చేసుకొని , శోభనచల స్టూడియోస్ ద్వారా ఎంతో మంది నటి నటులను , సాంకేతిక నిపుణులను పరిచయం చేశారని చెప్పారు .

త్వరలో తెలుగు సినిమా రంగం తరుపున ఆమెకు సత్కారం చేస్తామని ప్రసన్న ఈ సందర్భంగా చెప్పారు .
ఈ సమావేశంలో కృష్ణవేణి గారి కుమార్తె , నిర్మాత అనురాధ దేవి, ఆకృతి సుధాకర్ కూడా పాల్గొన్నారు .

Related posts