telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వర్మ మరో సంచలనం… ‘అర్నాబ్ – ది న్యూస్ ప్రాస్టిట్యూట్’ ప్రముఖ జర్నలిస్ట్ పై సినిమా

RGV

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి బాలీవుడ్‌లో ఇప్పటికీ ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు దశలో ఉంది. ముంబై పోలీసులు, బిహార్ పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ ప్రముఖులను ముంబై పోలీసులు ప్రశ్నించారు. అయితే సుశాంత్ సింగ్‌ది ఆత్మహత్య అని ముంబై పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినా.. ఆయన కుటుంబ సభ్యులు, బాలీవుడ్‌లో కొంత మంది నటీనటులు ఇది హత్యే అని ఆరోపిస్తున్నారు. హిందీ చిత్ర పరిశ్రమలో ఉన్న కుట్రలు, కుతంత్రాలకు సుశాంత్ బలైపోయారని వాదిస్తున్నారు.

ఇదిలా ఉంటే ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి తన డిబేట్ షోలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి సంబంధించి బాలీవుడ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌లోని చీకటి రహస్యాలు బయటపడాల్సిన సమయం వచ్చిందన్నారు. బాలీవుడ్‌ను ‘డర్టీ’ అని సంబోధించారు. అండర్ వరల్డ్‌తో బాలీవుడ్‌కు సంబంధాలున్నాయని అన్నారు. దివ్య భారతి మృతి మొదలుకొని జియా ఖాన్, శ్రీదేవి, ఇప్పుడు సుశాంత్ వరకు బాలీవుడ్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అయితే అర్నాబ్ చేసిన వ్యాఖ్యలపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. అర్నాబ్‌‌పై ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు.

బాలీవుడ్‌పై అర్నాబ్ గోస్వామి ఇంత దారుణంగా మాట్లాడటం చూసి తాను షాక్ అయ్యానని, ఇది డర్టీ ఇండస్ట్రీ అని, క్రిమినల్ కనెక్షన్స్ ఉన్నాయని, రేపిస్టులు, గ్యాంగస్టర్స్, కామ పిశాచాలతో ఈ ఇండస్ట్రీ నిండిపోయిందని అర్నాబ్ అన్నట్టు వర్మ వెల్లడించారు. ‘‘దివ్య భారతి, జియా ఖాన్, శ్రీదేవి, సుశాంత్ మరణాలు ఒకే రకమైనవని అర్నాబ్ గోస్వామి గుడ్డిగా కంబైన్ చేసి చెప్పడం.. ఈ మరణాలకు బాలీవుడ్ కారణం అని చెప్పడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. నిజానికి ఈ 4 మరణాలు గడిచిన 25 ఏళ్లలో జరిగినవి. ఈ నాలుగు కేసులు పూర్తిగా విరుద్ధమైనవి, వేర్వేరు సందర్భాల్లో జరిగినవి. కానీ, అర్నాబ్ మనసు మాత్రం ఈ నాలుగు ఒకటేనని చెబుతోంది. వీరందరినీ బాలీవుడ్ చంపేసిందని అంటోంది. బాలీవుడ్ ఏమైనా విలే పార్లే శ్మశానంలో నిద్రపోతున్న దెయ్యమా? రక్తదాహంతో ఉన్పప్పుడల్లా ఇది డ్రాకులాలా మారిపోయి బయటికి వచ్చి చంపేస్తోందా?’’ అని వర్మ ప్రశ్నించారు. అలాగే, బాలీవుడ్ ప్రముఖలపై వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్నాబ్ గోస్వామి మొరుగుతుంటే ఆదిత్య చోప్రా, కరణ్ జోహార్, మహేష్ భట్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ సహా ఇతర బాలీవుడ్ స్టార్లు ఎందుకు భయపడుతున్నారో, ఆఫీసుల్లో బల్లల కింద ఎందుకు దాక్కుంటున్నారో అర్థం కావడం లేదని వర్మ మండిపడ్డారు. కనీసం ఇప్పటికైనా సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు బయటికి వచ్చి అర్నాబ్ గోస్వామి తప్పుడు ప్రకటనలపై మాట్లాడాలని, జింకలా భయపడకుండా అడవి శునకంలా విరుచుకుపడాలని సూచించారు. అర్నాబ్ గోస్వామి నిజాన్ని దాచిపెట్టి తన డిబేట్‌లు నడుపుకోవడానికి వాడుకుంటారని వర్మ ఆరోపించారు. డిబేట్‌లో కూడా ఏ ఒక్కరి అభిప్రాయాన్ని ఆయన పట్టించుకోరని, అది ఆయన కార్వనిర్వహణ పద్ధతి అని వర్మ విమర్శించారు. ఓ వైపు అర్నాబ్ గోస్వామిపై విరుచుకుపడుతూ వరుస ట్వీట్లు చేస్తూనే ఆయనపై సినిమాను ప్రకటించేశారు వర్మ.

ఈ సినిమాకు ‘అర్నాబ్ – ది న్యూస్ ప్రాస్టిట్యూట్’ అని టైటిల్ పెట్టారు. ఇప్పటి వరకు సినిమా ప్రముఖులు, అండర్ వరల్డ్ డాన్స్, ఫ్యాక్షనిస్టులు, రాజకీయ నాయకులపై సినిమాలు తీసిన వర్మ.. తొలిసారి ఒక జర్నలిస్ట్‌‌కు వ్యతిరేకంగా సినిమా చేయబోతున్నారు. అందులోనూ దేశ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉన్న అర్నాబ్ గోస్వామిపై సినిమా తీయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకవేళ అర్నాబ్ గోస్వామి తన సినిమాపై స్పందించినా, తనను కించపరచడానికి ప్రయత్నించినా దాన్ని తన సినిమా ప్రచారం కోసం వాడుకుంటానని వర్మ స్పష్టం చేశారు. అంతేకాదు, అర్నాబ్ నోటిని చెత్తకుప్పతో పోల్చారు. సినిమాల్లో హీరోలుగా ఉన్న వారంతా బయటికి వచ్చి అర్నాబ్ గోస్వామి లాంటి విలన్‌పై పోరాడాలని వర్మ సూచించారు.

Related posts