telugu navyamedia
వార్తలు సామాజిక

మహారాష్ట్ర లో వరుడు..యూపీలో వధువు.. వీడియో కాన్ఫరెన్స్ లో వివాహం

కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా జీవన విధానం మొత్తం స్తంభించిపోయింది. లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో కార్యకలాపాలన్నీ ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. అయితే ఈ వైరస్ పెళ్లిళ్లను మాత్రం అడ్డుకోలేకపోతోంది. ఇప్పుడు మిస్సయితే మళ్లీ మంచి ముహూర్తాలు లేవన్న కారణంతో సామాజిక మాధ్యమాల వేదికగా పెళ్లి తంతు ముగించేస్తున్నారు. తాజాగా ముంబైకి చెందిన వరుడు, ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన వధువు వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జూమ్ ద్వారా ఒక్కటయ్యారు.

వివరాల్లోకి వెళ్తే.. సుషేన్ దంగ్ (26), కీర్తి నారంగ్‌ల పెళ్లి గతంలోనే నిశ్చయమైంది. ఇద్దరూ ఘనంగా పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే, కరోనా లాక్‌డౌన్ కారణంగా వారి ఆశ తీరే మార్గం లేకుండా పోయింది. అంతమాత్రాన పెళ్లిని వాయిదా వేయడం ఇష్టం లేని ఇరువురు వీడియో కాల్ ద్వారా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ ‘జూమ్’ను ఎంచుకున్నారు.

సుషేన్ ముంబైలో సంప్రదాయ దుస్తులు ధరించి పెళ్లి కొడుకులా ముస్తాబుకాగా, బరేలీలోని వధువు పెళ్లి కూతురిలా ముస్తాబైంది. ఆమె తండ్రి ఆన్‌లైన్‌లోనే సుషేన్‌కు కన్యాదానం చేశారు. రాయ్‌పూర్‌కు చెందిన పురోహితుడు అక్కడి నుంచే ఆన్‌లైన్‌లో మంత్రాలు చదువుతూ పెళ్లి తంతు కానిచ్చేశాడు. ఈ పెళ్లికి బంధువులు కూడా భారీగా హాజరయ్యారు. అయితే నేరుగా మాత్రం కాదండోయ్.. వారివారి ఇళ్లలో ఉండే ఆన్‌లైన్‌లోనే హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఇప్పటికే పలు డిజిటల్ వివాహాలు జరిపించిన షాదీ డాట్ కామ్ అనే సంస్థే ఈ పెళ్లిని కూడా జరిపించింది.

Related posts