telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ లో నరైన్ కు క్లిన్ చిట్ ఇచ్చిన బీసీసీఐ…

కోల్‌కత నైట్ రైడర్స్ కు స్పిన్నర్ సునీల్ నరైన్ ను హెచ్చరిక జాబితా నుండి తొలగించినట్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే అక్టోబర్ 10న కింగ్స్ ఎలెవన్ పంజాబ్- కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో నరైన్ స్పిన్ మాయాజాలంతో కేకేఆర్ విజయం సాధించింది. పంజాబ్ జట్టుకు 18 బంతుల్లో 25 పరుగులు కావాల్సిన సమయంలో నరైన్ తన స్పిన్ బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టును దెబ్బతీశాడు. తాను వేసిన 18 వ ఓవర్లో 2 పరుగులు ఇవ్వడం మాత్రమే కాకుండా ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. అలాగే చివరి ఓవర్లో పంజాబ్ కు 14 పరుగులు కావాల్సిన సమయంలో నరైన్ 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దాంతో కేకేఆర్ విజయం సాధించింది.

కానీ అప్పుడు మ్యాచ్ లో నరైన్ బౌలింగ్ ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ ఆన్‌ఫీల్డ్‌ అంపైర్లు క్రిస్‌ గఫెనీ, ఉల్హాస్‌ బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. దాంతో బీసీసీఐ నరైన్‌ ను హెచ్చరిక జాబితాలో ఉంచుతున్నట్లు తెలిపింది. అయితే తాజాగా బీసీసీఐ సస్పెక్ట్ బౌలింగ్ యాక్షన్ కమిటీ ఆ మ్యాచ్ లోని నరైన్ బౌలింగ్ యొక్క స్లో మోషన్ యాక్షన్ ఫుటేజ్ ను పరిశీలించింది. అందులో నరైన్ మోచేయి-బెండ్ సరైన పరిమితుల పరిధిలో ఉన్నట్లు కమిటీ నిర్ధారణకు వచ్చింది. దాంతో అతను మళ్ళీ బౌలింగ్ చేయవచ్చు అని వారు తెలిపారు. అయితే ఈ ఫిర్యాదు కారణంగా నరైన్ ఈ రోజు కోల్‌కత సన్ రైజర్స్ తో ఆడుతున్న మ్యాచ్ తో కలిపి మొత్తం 3 మ్యాచ్ లలో జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇక తర్వాతి మ్యాచ్ లో మరి నరైన్ ఆడుతాడా… లేదా అనేది చూడాలి.

Related posts