telugu navyamedia
సినిమా వార్తలు

“మిస్ట‌ర్ మ‌జ్ను” మా వ్యూ

Mr.Majnu

బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
న‌టీన‌టులు : అఖిల్ అక్కినేని, నిధి అగ‌ర్వాల్‌, ప్రియ‌ద‌ర్శి, నాగ‌బాబు త‌దిత‌రులు
దర్శకత్వం : వెంకీ అట్లూరి.
సంగీతం: త‌మన్‌
ఛాయాగ్ర‌హ‌ణం: జార్జ్‌ సి. విలియమ్స్‌
కొరియోగ్రఫీ : శేఖర్‌
నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్

అక్కినేని అఖిల్, నిధి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం “మిస్టర్ మజ్ను”. “తొలిప్రేమ” చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు మొదలయ్యాయి. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ లు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ప్రీరిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరిగింది. ఇప్పటికే విడుదలైన ప్రీమియర్ షోలకు పాజిటివ్ టాక్ వచ్చింది. అఖిల్ తాను ఇప్పటివరకు నటించిన రెండు చిత్రాలతోనూ హిట్ ను అందుకోలేకపోయాడు. మరి ఈసారైనా అఖిల్ కు సరైన హిట్ పడిందా ? మంచి అంచనాలతో అఖిల్ నటించిన “మిస్టర్ మజ్ను” చిత్రం ఈరోజు పేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా అనేది చూద్దాం.

కథ :
విక్కీ (అఖిల్) యూకేలో ఎంఎస్ చేస్తుంటాడు. తనకున్న చాకచక్యంతో, అందంతో అమ్మాయిల్ని చిటికెలో ఆకర్షిస్తాడు విక్కీ. అలాంటి విక్కీ కి చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండడం మామూలే కదా. మరోవైపు రాముడిలాంటి భర్త కావాలనుకునే సాధారణ అమ్మాయి నిక్కీ (నిధి అగర్వాల్). ఇద్దరూ ఒకే విమానంలో ఇండియాకు వస్తారు. విక్కీని చూసి అసహ్యించుకుంటుంది నిక్కీ. ఇండియాలోని ఓ పెళ్ళిలో కలుసుకున్న వీళ్ళు బంధువులే అని తెలుసుకుంటారు. ఆ తరువాత ఇద్దరూ ప్రేమలో పడతారు. అయితే విక్కీ తనకు ఎవరినీ ఎక్కువ రోజులు ప్రేమించడం తెలియదని చెప్తాడు. నిక్కీ మాత్రం రెండు నెలలు ప్రేమించుకుని చూద్దామని చెప్తుంది. మరి ఆ రెండు నెలల తరువాత ఏం జరిగింది ? నిక్కీ, విక్కీ ఒక్కటయ్యారా ? లేదా ఎవరిదారి వారు చేసుకున్నారా ? అనే విషయాలు తెలియాలంటే సినిమాను వెండితెరపై వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :
అఖిల్ యాక్షన్ సన్నివేశాల్లో బాగా నటించాడు. కానీ ఎమోషనల్ సన్నివేశాల్లో హావ‌భావాలను పలికించడంలో అఖిల్ నటన ఇంకాస్త మెరుగైతే బాగుంటుందనిపిస్తుంది. డ్యాన్సుల ప‌రంగా అఖిల్ త‌న ప్ర‌తిభ‌ని మరోసారి రుజువు చేశాడు. నిధి అగ‌ర్వాల్ కు హీరోతో స‌మానమైన పాత్ర దక్కింది. ఆమె అందం, అభిన‌యం ప‌రంగా ఫ‌ర్వాలేద‌నిపించింది. విద్యుల్లేఖ రామ‌న్‌, సుబ్బ‌రాజు, ప్రియ‌ద‌ర్శి, హైప‌ర్ ఆది త‌దిత‌రులు తమ పాత్రల ప‌రిధి మేర‌కు న‌వ్వించారు. జ‌య‌ప్ర‌కాష్‌, నాగ‌బాబు, రావు ర‌మేష్‌, ప‌విత్ర లోకేష్‌, సితారతో పాటు ప‌లువురు నటీనటులు తెరపై కన్పించినా వారి పాత్రలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదన్పిస్తుంది.

సాంకేతిక వర్గం పనితీరు :
దర్శకుడు వెంకీ అట్లూరి మరోసారి తన సెన్సిబుల్ మేకింగ్ తో భిన్న మ‌న‌స్త‌త్వాలున్న ఒక అబ్బాయి, అమ్మాయి మ‌ధ్య సాగే సంఘ‌ర్ష‌ణను తెరపై బాగానే చూపించాడు. సినిమా ప్రథమార్థం సరదా సన్నివేశాలతో, ద్వితీయార్థం ఎమోషనల్ సీన్స్ తో నడిపించారు దర్శకుడు వెంకీ అట్లూరి. అయితే ద్వితీయార్థంలో కథనం నెమ్మదించింది. కొన్ని రొటీన్ సీన్లు ప్రేక్షకులను ఇబ్బంది పెడతాయి. కథలో కొత్తదనం లేకుండా సాదాసీదాగా నడుస్తున్నట్టనిపిస్తుంది. త‌మన్ సంగీతం, జార్జ్ కెమెరా ప‌నిత‌నం బాగున్నాయి. నిర్మాణ విలువ‌లు కూడా బాగున్నాయి.

రేటింగ్ : 2.5/5

Related posts