telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇర్ఫాన్ ఖాన్ కు నివాళిగా ఆ గ్రామ ప్రజలు చేసిన పని ఇదే…!

Irfan

ప్రముఖ బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి చెందిన విషయం తెలిసిందే. గతనెల 29న ఆయన కేన్సర్‌తో కన్నుమూశారు. అయితే ఆయన మృతిపై దేశ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, సినీ తారలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే ఇర్ఫాన్ ఖాన్ మృతితో ఓ గ్రామం మాత్రం శోక సంద్రంలో మునిగిపోయింది. ఇర్ఫాన్‌ను మరిచిపోలేక ఆ ఊరి ప్రజలు ఆయనకు సరికొత్తగా నివాళలుర్పించారు. మహారాష్ట్రలోని ఇగత్ పురి గ్రామ ప్రజలు తమ ఊరిలోని ఓ ప్రాంతానికి ఆయన పేరు పెడుతూ నిర్ణయం తీసుకొంటూ ఇర్ఫాన్‌కు ఘన నివాళి అర్పించారు. ఇగత్‌పురి గ్రామంలో ఇర్ఫాన్ ఖాన్‌కు ఓ ఫామ్ హౌస్ ఉంది. కొద్దికాలం క్రితం ఆ గ్రామాన్ని ఆయన దత్తత తీసుకొన్నారు. ఆ ఊరి ప్రజల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. గ్రామస్థుల కోసం అంబులెన్సులు, కంప్యూటర్లు, బుక్స్, రెయిన్ కోట్స్, పిల్లలకు స్వెటర్లు, పండుగ సమయంలో ప్రజలకు స్వీట్లు పంచడం చేశారు. ఆయన సేవలని మనసులో పెట్టుకున్న ఆ గ్రామ ప్రజలు ఇర్ఫాన్ మరణం తర్వాత గ్రామానికి హీరో -చీ- వాడీ అని పేరు పెట్టుకున్నారు. హీరో చీ వాడీ అంటే మరాఠీలో నైబర్ హుడ్ హీరో అని అర్థం. ఇర్ఫాన్ ఖాన్ గురించి ఇగత్‌పురి జిల్లా పరిషత్ సభ్యుడు గోరఖ్ బోడ్కే స్పందిస్తూ.. మా గ్రామానికి సంరక్షుడిలా వ్యవహరిస్తూ వస్తున్న ఇర్ఫాన్ పదేళ్లుగా గ్రామ ప్రజలకి సేవలందిస్తున్నారు. ఏ అవసరం వచ్చిన వెంటనే స్పందించేవారు. గ్రామ ప్రజలతో ఆయనకి మంచి అనుబంధం ఉంది. ఎప్పుడు ఏ సాయం కోరినా కూడా ఆయన కాదనలేదు. అలాంటి వ్యక్తి మాకు దూరం కావడం చాలా బాధగా ఉంది. మా హృదయాలలో ఇర్ఫాన్ ఎప్పటికీ నిలిచిపోవాలని ఊరు పేరు మార్చాం అని గోరఖ్ చెప్పారు. పదేళ్ల క్రితం ఇక్కడ ఓ ఇంటిని కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఈ గ్రామంతో ఆయనకు అనుబంధం పెరిగింది అని తెలిపారు.

Related posts