వామపక్ష నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చర్చలు శుక్రవారం విశాఖలో ప్రారంభమయ్యాయి. స్థానిక సాయి ప్రియ నిలయంలో సీపీఐ, సీపీఐ(ఎం) జాతీయ నాయకులతో పవన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటు, ఇతర అంశాలపై చర్చించారు. ఎన్నికల్లో ఎలా వెళ్లాలనే దానిపై వామపక్ష నేతలతో చర్చించినట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు. లెఫ్ట్ నేతలతో పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి మాసంలో సమావేశం కానున్నారు. ఈవీఎంల టాంపరింగ్ అంశంపై కూడ ఈ సమావేశంలో చర్చించినట్టు పవన్ చెప్పారు. కొంత కాలంగా మేం వామపక్షాలతో కలిసి పనిచేస్తున్నట్టు పవన్ తెలిపారు.
ఎన్నికల్లో పొత్తుల ముందు కొన్ని అంశాలపై ఏకాభిప్రాయానికి రావడానికి సమావేశం నిర్వహించినట్టు వెల్లడించారు.ఫిబ్రవరి మాసంలో మరోసారి సమావేశం కానున్నట్టు తెలిపారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అనేది తక్షణ అవసరంగా ఈ సమావేశంలో చర్చించినట్టు తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడ మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు చెప్పారు.