telugu navyamedia
ఆంధ్ర వార్తలు

విజయమ్మ ప్రమాదం వెనక కుట్ర..

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు సతీసమేతంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్ అంశాన్ని రాష్ట్రపతికి వివరించినట్లు చెప్పారు.

మాతృభాష ఉండేలా చూడాలని చెప్పినందుకు తనపై అనర్హత వేటు వేయాలని చూశారని, ప్రభుత్వం తనను తీసుకెళ్లి కొట్టిన అంశాన్ని వివరించానన్నారు. అలాగే ఏపీ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను, ఆర్ధిక సంక్షోభం ఇతర అంశాలను రాష్ట్రపతికి వివరించాన‌ని తెలిపారు.

నిన్న వైఎస్ విజయమ్మకు జరిగిన ప్రమాదంపై అనుమానాలున్నాయని రఘరామ కృష్ణరాజు అన్నారు. ఆ వాహనం కేవలం 3,500 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందన్నారు.

ట్యూబ్ లెస్ టైర్లు ఒకేసారి పేలవని, రెండు టైర్లు ఒకేసారి పేలడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయని రఘరామ కృష్ణరాజు అభిప్రాయపడ్డారు. ఇందులో ఏదో కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. వైఎస్ విజయమ్మ క్షేమంగా ప్రమాదం నుంచి బయటపడినందుకు సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.

అదే సమయంలో ఈ ప్రమాదానికి కారణాలపై జగన్ ప్రభుత్వం విచారణ చేపట్టాలని ఆయన కోరారు. తాను విజయమ్మతో మాట్లాడే ప్రయత్నం చేసినా వీలు పడలేదని చెప్పారు.

ముఖ్యమంత్రి దుష్టచతుష్టయం అని నిత్యం అంటుంటారు కాబట్టి విచారణ జరిపించాలని రఘరామ కృష్ణరాజు కోరారు. ముఖ్యమంత్రి కుటుంబంలో ఇలా జరగడం బాధాకరమని అని, గతంలో బాబాయిని కూడా కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts