చిత్తూర్ జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో నిన్న రీపోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. చెదురుమదురు ఘటనలు మినహా ఏడు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ నేపథ్యంలో పులివర్తివారిపల్లిలో ఓ ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. రీపోలింగ్ తీరుతెన్నులు పరిశీలించేందుకు వైసీపీ అభ్యర్తి చెవిరెడ్డి భాస్కరరెడ్డి పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చారు.
అప్పటికే అక్కడున్న టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని భార్య పులివర్తి సుధారెడ్డి ఆయనను చూసి మర్యాదపూర్వకంగా పలకరించారు. “అన్నా టీ తాగి వెళుదురు రండి… ఇంటికి వెళదాం” అంటూ ఆహ్వానించారు. అయితే చెవిరెడ్డి సుధారెడ్డి పిలుపును ఏమాత్రం పట్టించుకోకుండా తన ఫోన్ చూసుకుంటూ ముందుకు సాగిపోయారు. అనంతరం, వైసీపీ లోక్ సభ అభ్యర్థి రెడ్డప్ప రాగానే ఆయన్ను కూడా సుధారెడ్డి టీ తాగమని కోరారు. ఆయన చిరునవ్వుతో తిరస్కరించారు. దీనిపై సుధారెడ్డి స్పందిస్తూ ఎంతటి ప్రత్యర్థులైనా మన గ్రామానికి వచ్చినప్పుడు అతిథులుగానే భావిస్తామని పేర్కొన్నారు.