telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఆరోగ్యం బాగోలేదు..విచారణకు హాజరుకాలేను

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు సీఐడీకీ లేఖ రాసారు. తాను అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కాలేనని లేఖలో వెల్లడించారు. తాను ఢిల్లీ వెళ్లాక అనారోగ్యానికి గురయ్యాయనని లేఖలో వివరించారు. ఆరోగ్యపరమైన కారణాలతో వైద్యులను సంప్రదించాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో తనకు హాజరయ్యేందుకు నాలుగు వారాల సమయం కావాలని లేఖలో ఎంపీ రఘురామకృష్ణంరాజు కోరారు.

కొద్ది నెలల క్రితం ఏపీ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కల్గించేలా మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ సీఐడీ ఆయన పైన కేసు నమోదు చేసింది. ఆ కేసులో ఆయన్ను అరెస్ట్ చేసింది. ఆ తరువాత సుప్రీం కోర్టులో బెయిల్ పొందారు. కాగా, సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు తన సొంత నియోజకవర్గం నర్సాపురం రావాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా హైదరాబాద్ చేరుకున్న రఘురామకు సీఐడీ అధికారులు నోటీసులు అందించారు. ఈ నెల 17వ తేదీన (ఈ రోజు) మధ్నాహ్నం 3 గంటలకు గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకు రావాలని సూచించారు

తాను చట్టాన్ని గౌరవిస్తానని… తాను కోవిడ్ ప్రోటోకాల్ అమలు చేస్తూ విచారణకు హాజరువుతానని చెప్పారు. అయితే గతంలో తనను అరెస్ట్ చేసిన సమయంలో చిత్రహింసలకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తానని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

అంతేకాకుండా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై ఎంపీ రఘురామ ధ్వజమెత్తారు. తాను పారిపోయి ఢిల్లీలో ఉన్నానంటున్న విజయసాయి కామెంట్లను తిప్పికొట్టారు. తాను ప్రాణ రక్షణ కోసమే ఢిల్లీలో ఉన్నానని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉందనీ అన్నారు. తాను నియోజక వర్గానికి వెళ్లలేని పరిస్థితులు కల్పిస్తున్నారని విజయసాయికి దమ్ముంటే నర్సాపురం నుంచి పోటీ చేయాలన్నారు. విజయసాయికి రాజ్య సభ సభ్యత్వం ఇవ్వరన్న ప్రచారం జరుగుతోందని ఎద్దేవా చేశారు.

Related posts