telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కర్ణాటక మాదిరి .. నాలుగు భాగాలుగా రాష్ట్ర పరిపాలన… కమిటీ ముఖ్య సూచన..

committee report wise ap map

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి ప్రణాళికలపై సత్వర సమీక్ష జరిపి, రాజధాని సహా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సమగ్ర వ్యూహాన్ని సూచించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి తన నివేదికను అందజేసింది. వికేంద్రీకృత అభివృద్ధి కోసం శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవహారాలకు మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని కమిటీ సూచించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. పర్యావరణాన్ని, సమతుల ప్రాంతీయ అభివృద్ధి సాధనను దృష్టిలో ఉంచుకొంటూ, అందుబాటులో ఉన్న వనరులను అత్యుత్తమంగా ఉపయోగించుకోవాలని చెప్పిందని పేర్కొంది. కమిటీ కన్వీనర్ జీఎన్ రావు, సభ్యులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ- విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా ఉండాలని, అక్కడే సచివాలయం, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని సూచించామని చెప్పారు. వేసవిలో అసెంబ్లీ సమావేశాలకు తగ్గట్టుగా విశాఖలో ఏర్పాట్లు చేయాలని సూచించామన్నారు. విశాఖలో మౌలిక సదుపాయాలు ఉన్నాయని, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పెద్ద మొత్తంలో భూములు అందుబాటులో ఉన్నాయని, అందుకే ఈ సూచన చేశామని పేర్కొన్నారు.

ప్రస్తుత రాజధాని అమరావతి శాసన వ్యవహారాల రాజధానిగా ఉండాలని సూచించామని కమిటీ సభ్యులు చెప్పారు. కర్నూలులో హైకోర్టును, అమరావతి, విశాఖపట్నంలలో హైకోర్టు ధర్మాసనాలు ఏర్పాటు చేయాలని సూచించామని తెలిపారు.అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అమరావతిలో, శీతాకాల సమావేశాలు విశాఖపట్నంలో నిర్వహించాలని కమిటీ సూచించింది. మంగళగిరి, నాగార్జున విశ్వవిద్యాలయం మధ్య ప్రాంతానికి వరద ముప్పు లేదని, రాజ్‌ భవన్, అసెంబ్లీ అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పింది. కర్ణాటకను నమూనాను తీసుకొని, ఏపీని సమగ్రాభివృద్ధి కోసం నాలుగు ప్రాంతాలుగా వర్గీకరించాలని కమిటీ చెప్పింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను ఉత్తర కోస్తా ప్రాంతంగా; తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలను మధ్య కోస్తా ప్రాంతంగా; గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను దక్షిణ కోస్తా దక్షిణ కోస్తా ప్రాంతాలుగా; నాలుగు నైరుతి జిల్లాలు కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలను రాయలసీమగా వర్గకరించాలని సూచించింది.

ఈ నాలుగు ప్రాంతాల్లో కమిషనరేట్లు ఏర్పాటు చేయాలని, ఆయా ప్రాంతాలు అంశాలన్నింటినీ పరిష్కరించాలని కమిటీ ప్రతిపాదించింది. అమరావతిలోని తుళ్లూరు ప్రాంతంలో ముంపు ప్రమాదమున్న పలు చోట్ల నిర్మాణాలు నిలిపివేయాలని చెప్పింది. రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు భూములను అభివృద్ధి చేసి అప్పగించాలని పేర్కొంది. తాము రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించామని, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొన్నామని కమిటీ సభ్యులు తెలిపారు. 30 వేల వినతులను స్వీకరించామని, రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో విస్తృతంగా పర్యటించామని, అవసరమైన చోట భూమిని తిరిగి రైతులకు ఇచ్చేయాలని సూచించామని చెప్పారు.

భౌగోళిక పరిస్థితులను దృష్టిలో మూడు రాజధానుల గురించి సూచనలు చేశామని వారు పేర్కొన్నారు. సెప్టెంబరు 13న ఏర్పాటైన ఈ కమిటీకి మాజీ ఐఏఎస్ అధికారి (1988 బ్యాచ్) జీఎన్ రావు కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. కేటీ రవీంద్రన్, విజయ్ మోహన్, ఆర్.అంజలీ మోహన్, మహావీర్, సుబ్బారావు, అరుణాచలం తదితరులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. శుక్రవారం అమరావతిలో ఈ కమిటీతో సీఎం గంటకు పైగా చర్చించారు. ఈ సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. కమిటీ గతంలో మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఇప్పుడు 200 పేజీలతో కూడిన తుది నివేదికను అందించింది. నివేదికపై ఈ నెల 27న శుక్రవారం జరిగే మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

ఈ ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రాజధానులపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులు ఆందోళన చెందుతున్నారు. మూడు రాజధానులపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో రాజధానికి భూములిచ్చిన రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజధాని తరలింపు వద్దని, ప్రణాళిక ప్రకారం అభివృద్ధి కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఆర్‌డీఏను ఆదేశించాలని కోరుతూ రైతులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కేసు విచారణను న్యాయస్థానం నాలుగు వారాలకు వాయిదా వేసింది. ప్రభుత్వం, సీఆర్‌డీఏ కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. జీఎన్‌ రావు కమిటీ చట్టబద్ధత, హైకోర్టు తరలింపుపై గతంలో పిటిషన్‌ దాఖలైంది.

విపక్ష టీడీపీ, బీజేపీ నాయకులు రైతులకు మద్దతుగా వారి ఆందోళనల్లో పాల్గొంటున్నారు. రాజధాని రైతులకు అండగా ఉంటామని జనసేన ప్రకటించింది. జీఎన్ రావు కమిటీ నివేదిక పూర్తిగా సీఎం జగన్ మాటలనే పునరుద్ఘాటించిందని టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. జీఎన్‌రావు కమిటీ నివేదికను బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ స్వాగతించారు. జీఎన్‌రావు కమిటీ రిపోర్టుతో రాయలసీమకు 60 శాతం న్యాయం జరిగేలా ఉందని తెలిపారు. అలాగే అమరావతి, కర్నూలులో మినీ సచివాలయాలు పెట్టాలని కోరారు.

Related posts