telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు

మండిపోతున్న ఎండలు.. పిచ్చుకల్లా రాలిపోతున్న ప్రాణాలు.. మృతుల రికార్డు..

temparatures all time high in AP

జనం ప్రచండ భానుడి ఉగ్రరూపానికి ప్రాణాలు కోల్పోతున్నారు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకుపైబడి నమోదవుతున్నాయి. దీనితో వడగాలులు ప్రాణాలు తీస్తున్నాయి. తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో వడగాలుల కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని లింగరాజుపల్లిలో ఒకరు, తిమ్మాపురంలో మరొకరు ప్రాణాలు కోల్పోగా, భూదాన్‌పోచంపల్లి మండలం ఇంద్రియాలలో ఒకరు, రామన్నగూడెంలో ఇంకొకరు వడదెబ్బ బారిన పడి ప్రాణాలు విడిచారు.

నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఎన్జీ కొత్తపల్లి, బైరవునిబండ గ్రామాలకు చెందిన ఇద్దరు మృతి చెందగా, సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండలంలో ‘ఉపాధి’ పని అనంతరం ఇంటికి వెళ్తున్న అంగరాజు చిన్న వెంకన్న(56) ఎండదెబ్బకు తాళలేక కిందపడి మృతి చెందాడు.

మరో మూడు రోజులు ఈ ఎండల తీవ్రత మరింతగా ఉంటుందని, వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. చిన్నారులు, వృద్ధులు బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో ఎన్నడూ లేనంతగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని బాణాపురంలో సోమవారం అత్యధికంగా 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రోహిణి కార్తె రాకముందే ఎండలు ఈ స్థాయిలో ఉన్నాయంటే.. అప్పుడు ఇంకెలా ఉంటాయోనని ప్రజలు భయపడుతున్నారు.

Related posts