telugu navyamedia
సినిమా వార్తలు

జడ్జి పిలిస్తే కోర్టుకు వచ్చి సంతకాలు పెట్టి వెళ్తున్నాం- మోహన్ బాబు

జడ్జి పిలిస్తే కోర్టుకు వచ్చి సంతకాలు పెట్టి వెళ్తున్నామ‌ని సినీ నటుడు మోహన్ బాబు చెప్పారు. 2019లో నమోదైన కేసుకు సంబంధించి మోహన్ బాబు తన కుమారులు మంచు విష్ణు , మనోజ్‌లతో కలిసి మంగళవారం తిరుపతి కోర్టులో హాజర‌య్యారు.

ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.. కోర్టు సమన్లు తనకు అందలేదని, అయినా న్యాయాధిపతి రమ్మని పిలిచారని.. ఆయన సమక్షంలో సమన్లపై సంతకం చేశానన్నారు.

పాదయాత్రగా వచ్చామని ఏ మూర్ఖుడు చెప్పారని మీడియా ప్రతినిధులను మోహన్ బాబు ప్రశ్నించారు. జనం ఉండడంతో కారులో వచ్చి అక్కడ దిగాము.. మన కోసం వచ్చిన వారిని ప్రేమించాలి.. హ్యాపీగా వాళ్లతో నడిచి వచ్చాము.. కోర్టు లోపలికి వెళ్లాం.’’ అని మోహన్ బాబు మీడియాకు చెప్పారు.ఈ కేసు విచారణను కోర్టు ఈ ఏడాది సెప్టెంబర్ 20వ తేదీకి వాయిదా వేసింది.

2019 మార్చి 22వ తేదీన తిరుపతి, మదనపల్లె జాతీయ రహదారిపై మోహన్‌బాబు, మంచు విష్ణు, మనోజ్‌, విద్యానికేతన్‌ విద్యాసంస్థల సిబ్బంది, విద్యార్థులతో కలిసి బైఠాయించి, ధర్నా చేపట్టారు. ఆ సమయంలో సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది. అప్పటి చంద్రగిరి ఎంపీడీవో, మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ బృందం అధికారి హేమలత పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దాంతో మోహన్‌బాబు, ఆయన కుమారులు మంచు విష్ణు, మనోజ్‌కుమార్‌, శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థల ఏవో తులసినాయుడు, పీఆర్వో సతీష్‌లు రోడ్డుపైకి వచ్చి వాహనదారులకు ఇబ్బంది కలిగించారని ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని కేసు నమోదు చేశారు. ధర్నాకు ముందస్తు పోలీసుల అనుమతి లేదని కూడా తెలిపారు. 341, 171(ఎఫ్‌), పోలీస్‌ యాక్ట్‌ 290 కింద చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Related posts