telugu navyamedia
రాజకీయ

ఉగ్రవాదంపై.. ఉక్కు పాదం.. ప్రధాని మోడీ

PM Modi says India is great

ఉగ్రవాదులకు వడ్డీతో సహా బదులు చెల్లించి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని నరేంద్రమోదీ హెచ్చరించారు. ఉగ్రవాదులు బీభత్సం సృష్టిస్తుంటే భారత్ ఇక ఎంతమాత్రం నిస్సహాయంగా చూస్తూ ఉండబోదని తేల్చిచెప్పారు. వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్‌ను చూసి ప్రతి భారతీయుడు గర్వపడుతున్నారని అన్నారు. విపక్షాలు మాత్రం భద్రతా బలగాల్ని అనుమానిస్తూ పరోక్షంగా పాకిస్థాన్‌కు సహాయం చేస్తున్నాయని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముంబై దాడుల అనంతరం లక్షిత దాడులకు సైన్యం సన్నద్ధమైనా అప్పటి యూపీఏ ప్రభుత్వం మోకాలొడ్డిందని ఆరోపించారు.

దేశ తొలి మహిళా రక్షణమంత్రి నిర్మలా సీతారామన్, పరాక్రమశాలి పైలట్ అభినందన్ ఇద్దరూ తమిళనాడుకు చెందినవారు కావడం గర్వకారణంగా ఉందన్నారు. రెండు రోజుల క్రితం వాయుసేన చేసిన లక్షిత దాడులు భారతదేశ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాయని కితాబునిచ్చారు. అలాగే భద్రతా బలగాలకు, అభినందన్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయని పేర్కొన్నారు.

2004-14 మధ్య కాలంలో హైదరాబాద్, ముంబై, బెంగళూరు, పుణే నగరాల్లో ఉగ్రవాదులు మారణకాండకు పాల్పడ్డారు. కానీ, నాటి సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ, ప్రస్తుతం పరిస్థితులు మారాయి. భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం. వారిలో విశ్వాసాన్ని పెంచాం. యురి సంఘటనకు ఉగ్రవాదులు పాల్పడితే లక్షిత దాడులతో జవాబు చెప్పాం. పుల్వామా ఉగ్రదాడికి వారు పాల్పడితే బాలాకోట్ మెరుపుదాడితో బుద్ధి చెప్పాం. ఉగ్రవాదులకు వడ్డీతో సహా బదులు చెల్లించి ప్రతీకారం తీర్చుకుంటాం. దేశం కోసం తమ ప్రాణాల్ని పణంగా పెడుతున్న సైనికులకు ఇదే నా సెల్యూట్ అని మోదీ పేర్కొన్నారు.

Related posts