telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఫారం-7 తో ఈసీ కి తలనొప్పి.. ఓటు తీసేయాలని లక్షలలో అర్జీలు.. ఇక క్రిమినల్ కేసులే.. !

ec got issue with huge requests on form 7

ఎన్నికల సందర్భంగా ఓటు గుర్తింపు కోసం ప్రక్రియ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎవరైనా తాము పుట్టిన స్తానం నుండి దూరంగా ఉన్నట్టయితే, ఉన్న చోటే ఓటు నమోదు చేసుకొని, పుట్టిన చోటులో ఓటు గుర్తింపు తొలగించమని ఫారం-7 ద్వారా అర్జీ చేసుకుంటారు. ఇలాంటివి సాధారణమే అయినప్పటికీ, తాజాగా ఇది పరిధిని మించి అసాధారణంగా లక్షలలో ఇలాంటి అర్జీలు ఈసీ కి వస్తున్నాయి. అయితే ఇది కావాలనే చేస్తున్నట్టుగా భావిస్తున్న అధికారులు, తగిన చర్యలకు పూనుకుంటున్నారు.

అయితే రెండు రోజుల క్రితం 5 వేలు ఓట్లు తొలగించారని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాష్ట్రమ్రంతా ఓట్లు తొలగింపుపై ఒకేసారి లక్షల్లో అభ్యంతరాలు ఇంటర్నెట్ ద్వారా ఎన్నికల అధికారులకు చేరాయి. దీనితో జిల్లా ఎన్నికల అధికారులు సైబర్‌క్రైం జరిగినట్టు గ్రహించి ఎన్నికల ప్రధాన అధికారి దృష్టికి తీసుకువెళ్లడంతో ఏపీ అంతటా ఓట్లు తొలగింపు అలజడి ఆరంభమైంది. 13 జిల్లాల్లో 5 లక్షల 20 వేల ఓట్లు ఫారం-7 ద్వారా డిలీషన్ కోసం 24 గంటల్లో అప్‌లోడ్ కావడం పట్ల అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 32000 ఓట్లు ఒక్కరోజులో తొలగింపునకు ఫారం-7 అప్‌లోడ్ కావడం గమనార్హం.

ఈ తంతు కేవలం నియోజకవర్గానికే పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్ అంతటా చోటుచేసుకుంది. రాష్ట్ర ఎన్నికలు కమీషన్ కూడా ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించింది. కమీషన్ డాష్‌బోర్డులో ఒకేసారి ఓట్లు తొలగించాలంటూ అభ్యంతరం వ్యక్తం చేసిన జాబితా నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాలు వారీగా వందల సంఖ్యలో రావడంతో అధికారులు పొలింగ్ కేంద్రాలు వారీగా సిబ్బందిని అప్రమత్తం చేశారు. నియోజకవర్గం వారీగా సగటున 4 వేలు వరకు ఇటువంటి అభ్యంతరాలు కేవలం రెండు రోజుల్లో రావడంతో అధికారులు, యంత్రాంగం అయోమయానికి గురయ్యారు.

ఇప్పటికే ఎన్నికలు ప్రక్రియకు సంబంధించిన నివేదికలు సిద్ధం చేయడంలో తలమునకలై ఉన్న యంత్రాంగానికి ఫారం-7 సృష్టించిన అలజడి మరింత తలనొప్పిగా తయారు అయ్యింది. శ్రీకాకుళం జిల్లాలో అధిక సంఖ్యలో ఫారం-7 అప్‌లోడ్ చేసే వారిని గుర్తించి ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయాలంటూ ఆదేశించారు. అటువంటి వారిని వెంటనే గుర్తించి క్రిమినల్ చర్యలు చేపట్టాలన్నారు. ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్నవారిపై కఠిన చర్యలు చేపట్టాలన్నారు.

Related posts