రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ నిర్ణయం ప్రకారం రాజధానిపై నిర్ణయం ఉంటుందని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. రాజధాని ఆందోళనలపై ఆయన విమర్శలు గుప్పించారు. అయినా ఆలు లేదు సూలు లేదు.. దేవినేని ఉమ మాత్రం ధర్నా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏమీ మొదలవ్వకుండానే చంద్రబాబు కోడి గుడ్డుపై ఈకలు పీకుతున్నారని మండిపడ్డారు. ఇదేమీ కొంపలు మునిగే వ్యవహారం కాదని కొట్టిపారేశారు.
మూడు పూటల్లో పవన్ మూడు మాటలు చెబుతారని విమర్శించారు. ఇక సుజనా చౌదరి తీరు చూస్తుంటే కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్నట్లుగా ఉందని ఎద్దేవాచేశారు. జైల్లో పెడతారని సుజనా బీజేపీలోకి వెళ్లారని ఆరోపించారు. అయినా ఆయన చెప్పేది ఎవరు వింటారని ప్రశ్నించారు. తానే ప్రధాని, తానే బీజేపీ అధిష్టానం అన్నట్లు సుజనా మాట్లాడుతున్నారని విమర్శించారు.అభివృద్ధి ఒకే ప్రాంతంలో ఉంటే ప్రాంతీయ విద్వేషాలు వచ్చే అవకాశం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. మూడు రాజధానులపై ఆ ప్రాంత నేతలతో చర్చించకుండా చంద్రబాబు విభేదించారన్నారు.