telugu navyamedia
ఆంధ్ర వార్తలు

వ్యాపారి నిర్ల‌క్ష్యం చావుబ‌తుకుల్లో విద్యార్ధి..

*వ్యాపారి నిర్ల‌క్ష్యం చావుబ‌తుకుల్లో విద్యార్ధి..
*వాట‌ర్ బాటిల్‌కు బ‌దులుగా యాసిడ్‌ బాటిల్ ఇచ్చిన షాపు యాజ‌మాని..
*నీళ్లు అనుకొని యాసిడ్ తాగిన విద్యార్ధి..ఆస్ప‌త్రిలో చికిత్స‌..ప‌రిస్థితి విష‌మం..
*లయోల కళాశాలలో డిగ్రీ ఫైనలియర్  చదువుతున్న విద్యార్ధి

విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యాపారి నిర్లక్ష్యానికి డిగ్రీ విద్యార్థి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివ‌రాల్లోకి వెళితే..

లయోలా కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న చైతన్య అనే విద్యార్థి తనకు దాహం వేయడంతో ఎనికేపాడులో ఓ దుకాణం వద్ద వాటర్ బాటిల్ అడిగాడు. ఆ షాపు యాజ‌మాని వాటర్ బాటిల్ కు బ‌దులుగా యాసిడ్ బాటిల్ ఇచ్చినట్లు బాధిత కుటుంబీకులు వాపోతున్నారు. అప్పటికే దాహం వేస్తుండటంతో విద్యార్థి చైతన్య చూసుకోకుండా వాటర్ అనుకుని యాసిడ్‌ను గడగడా తాగినట్లు చెబుతున్నారు.

చైతన్య శరీరంలోకి యాసిడ్ వెళ్లడంతో వెంటనే అతడు మంటతో అల్లాడిపోయాడు. వెంటనే స్నేహితులు అతడిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. నాలుగురోజులుగా చైతన్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. యాసిడ్ అతడి శరీర అవయవాలపై తీవ్ర ప్రభావం ప‌డినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రిడ్జ్‌లోకి యాసిడ్ బాటిల్ ఎలా వ‌చ్చింది..యాజ‌మాని నిర్ల‌క్ష్య‌మా లేక మ‌రేదైనా కార‌ణం ఉందా కోణంలో విచారిస్తున్నారు.

Related posts