బీజేపీ ప్రభుత్వం ప్రజల్లో అభద్రతాభావం సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని, ఇందుకోసం మరోసారి బాలాకోట్ తరహా దాడులు జరిపి ఓట్లు రాబట్టుకోవాలనుకుంటోందని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. సోమవారంనాడిక్కడ మీడియాతో ఆమె మాట్లాడుతూ, నరేంద్ర మోదీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ఇక్కడ ఓట్ల ఏకీకరణను నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని అన్నారు. ‘బాలాకోట్ డ్రామా ఆడారు. అయినప్పటికీ మొదటి విడత ఎన్నికల్లో ఓటమి వారికి స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఇతర విడతల్లోనైనా ఓట్లు పొందేందుకు ప్రజల్లో అభద్రతా భావం కల్పించి, మరోసారి బాలాకోట్ తరహా దాడులకు మోదీ వ్యూహరచన చేస్తున్నారు’ అని ఆరోపించారు.
బీజేపీ ఏ పని చేసినా ఓట్ల కోసమే చేస్తోందని మెహబూబా ముఫ్తీ అన్నారు. పాకిస్థాన్‌పై దాడి కావచ్చు, కశ్మీర్‌పై కఠిన వైఖరి కావచ్చు….ఇదంతా ఓట్ల కోసమే కానీ మరొకటి కాదని ఆమె అన్నారు. పుల్వామా దాడి ఎలా చోటుచేసుకుందనే విషయంపై పూర్తి దర్యాప్తు జరిపినప్పుడే నిజానిజాలు వెలుగుచూస్తాయని ఆమె అన్నారు. కాగా, బీజేపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని, ఇది లౌకిక దేశమని, దీనికి వ్యతిరేకంగా మాట్లాడే నేతలకు మానసిక పరీక్షలు జరపాలని ఆదివారంనాడు కూడా బీజేపీ నేతలపై ముఫ్తి విమర్శలు గుప్పించారు.