telugu navyamedia
సినిమా వార్తలు

‘లైగర్’ మూవీ రివ్యూ..

టైటిల్‌ : లైగర్‌
నటీనటులు : విజయ్‌ దేవరకొండ, అనన్య పాండే, రమ్యకృష్ణ, మైక్‌టైసన్‌, విషురెడ్డి, అలీ తదితరులు
నిర్మాణ సంస్థలు: ధర్మా ప్రొడెక్షన్స్‌,పూరీ కనెక్ట్స్‌
నిర్మాతలు: పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, కరణ్‌ జోహార్, అపూర్వ మెహతా
దర్శకత్వం:పూరి జగన్నాథ్
సంగీతం :సునీల్‌ కశ్యప్‌, విక్రమ్‌ మాంట్రోస్‌, తనీష్‌ భాగ్చి
సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ
ఎడిటర్‌:జనైద్ సిద్దిఖీ
విడుదల తేది: ఆగస్ట్‌ 25, 2022

విజయ్‌ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన మోస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్ సినిమా లైగ‌ర్‌ . స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో విజయ్‌ సరసన అనన్య పాండే నటించింది.

పూరి కనెక్ట్స్ , బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌, పాటలకు భారీ స్పందన లభించింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘లైగర్‌’పై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచ‌నాల న‌డుమ‌ గురువారం (ఆగస్ట్‌ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 3000 పైగా థియేటర్లలో ఈ సినిమా సందడి చేస్తోంది. బాక్సాఫీస్ దగ్గర వాట్ లగా దేంగే అన్నాడా లేదో ‘లైగర్‌’ మూవీ రివ్యూలో చూద్దాం.

‘లైగర్‌’ కథేంటంటే..

లైగర్ (విజయ్ దేవరకొండ) కరీంనగర్ కుర్రాడు. తన తల్లి బాలామణి (రమ్యకృష్ణ) తో కలిసి ముంబై వెళతాడు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ కావాలనేది వాళ్ల‌ లక్ష్యం. నేషనల్ ఛాంపియన్ అవ్వాలని. ఒకప్పుడు లైగర్ తండ్రి కూడా పెద్ద ఫైటర్. కాబట్టి ఆమె తన కొడుకుని అంతకు మించి చూడాలనుకుంటుంది.

తల్లీ కొడుకులు కలిసి ఛాయ్ బండి పెట్టుకుంటారు. లైగర్‌కి మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ ఇప్పించాల‌నుకుంటుంది కానీ.. తల్లీ కొడుకుల దగ్గర రూపాయి ఉండ‌దు. లైగర్ తండ్రితో గతంలో పరిచయం ఉండటంతో ఫ్రీగా కోచింగ్ ఇవ్వడానికి క్రిస్టోఫర్ (రోనిత్ రాయ్) ముందుకు వస్తారు.

జీవితంలో ఏ అమ్మాయి జోలికి వెళ్లొదని, ప్రేమలో పడితే మన లక్ష్యాన్ని మర్చిపోతామని చెబుతుంటుంది. కోచింగ్ తీసుకునే సమయంలో అతనికి తాన్యా (అనన్యా పాండే) పరిచయం అవుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. అయితే, అతనికి నత్తి అని తెలిశాక తాన్య వదిలేసి వెళుతుంది. అది ‘లైగర్’లో కసి పెంచుతుంది. ఆ కసితో ఇండియాలో ఎంఎంఎ ఛాంపియన్ అవుతాడు.

ఆ తర్వాత వరల్డ్ ఛాంపియన్షిప్‌కు వెళ్ళడానికి డబ్బులు లేకపోతే అమెరికాలో ఒకరు స్పాన్సర్ చేస్తారు. ఆయన ఎవరు? అమెరికా వెళ్ళిన తర్వాత మళ్ళీ లైగర్ జీవితంలోకి తాన్య ఎందుకు వచ్చింది? ఆమెను ఎవరో కిడ్నాప్ చేస్తే కాపాడటానికి లైగర్ ఎందుకు వెళ్ళాడు? ఆల్ టైమ్ గ్రేట్ మైక్ టైసన్‌తో ఎందుకు ఫైట్ చేయాల్సి వచ్చింది? ఆ తర్వాత ఏమైంది? అనేది మిగతా సినిమా.

విశ్లేషణ..

పూరీ సినిమాలు ఇలా ఉంటాయి అని ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎలా ఉంటుందని ఊహించుకుని వెళ్తారో.. అదే సినిమా చూపిస్తారు పూరీ. ఇప్పుడు లైగర్ కూడా అదే. కాకపోతే ఇది పాన్ ఇండియా స్టైల్‌లో కాస్త గ్రాండ్‌గా చూపించారంతే. అయితే తనదైన స్టైల్ డైలాగులు, విజయ్ దేవరకొండ మార్క్ మేనరిజంస్, మైక్ టైసన్ స్పెషల్ ఎట్రాక్షన్ తో లాగేయచ్చు అనుకుని ఉండవచ్చు.

విజయ్ లాంటి నటుడు దొరికేసరికి లైగర్ స్వరూపమే మారిపోయింది. చిన్న బడ్జెట్ తో చేయాలనుకున్న సినిమాను.. పాన్ ఇండియా యాక్షన్ సినిమాగా మార్చేశారు పూరీ. మొదటి సీన్ నుంచే కథలోకి వెళ్లిపోయాడు దర్శకుడు పూరి జగన్నాథ్. తాను ఏం చెప్పాలనుకుంటున్నాడో అది మాత్రమే స్క్రీన్ మీద చూపించాడు.

ఫస్టాఫ్ అంత యాక్షన్ సన్నివేశాలతో పాటు.. అక్కడక్కడ మదర్ సెంటిమెంట్ ఉండేలా జాగ్రత్త పడ్డాడు. ఇంటర్వెల్ కు చిన్న ట్విస్ట్ ఇచ్చి.. ఆ తర్వాత నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ కు లైగర్ ఎలా వెళ్లాడు అనే జర్నీ చూపించాడు. మధ్యలో కావాలి కాబట్టి హీరోయిన్ తో కొన్ని సీన్స్, తల్లితో కొన్ని సీన్స్ పెట్టుకున్నారు .

అందరూ ముందు నుంచి ఊహించింది క్లైమాక్స్.. ఎందుకంటే అప్పుడే మైక్ టైసన్ వచ్చేది.. దాన్ని ఊహించినంత చిత్రీకరించలేకపోయాడు పూరి జగన్నాథ్. టైసన్ లాంటి ఫైటర్ను తీసుకొచ్చి చాలా సిల్లీగా క్లైమాక్స్ ప్లాన్ చేసినట్లు అనిపిస్తుంది. చాలా రొటీన్ కథకు ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే తోడు కావడంతో లైగర్ అంత ఆసక్తికరంగా మారలేదు.

ఎవరెలా చేశారంటే..

ఈ సినిమాకు ప్రధాన బలం విజయ్‌ దేవరకొండ యాక్టింగ్‌. ప్రాణం పెట్టి నటించాడు. లైగర్‌ పాత్ర కోసం ఆయన పడిన కష్టమంతా తెరపై కనిపిస్తుంది. నత్తితో ఆయన పలికిన డైలాగ్స్‌ సహజంగా అనిపిస్తాయి. గత సినిమాలలో కంటే ఇందులో విజయ్‌ నటన కొత్తగా ఉంటుంది. ఎనర్జిటిక్‌ ఫెర్ఫార్మెన్స్‌తో విజయ్‌ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. మైక్ టైసన్ తో వచ్చే సీన్స్ లో తనను తాను ప్రెజెంట్ చేసుకున్న విధానం విజయ్ దేవరకొండలో ఉన్న డెడికేషన్ ని చూపిస్తుంది.

ఇక లైగర్‌ తల్లి బాలామణిగా రమ్యకృష్ణ తనదైన నటనతో ఆకట్టుకుంది. తాన్యగా అనన్య పాండే మెప్పించింది. తెరపై అందంగా కనిపించింది. అయితే ఆ పాత్ర సినిమాపై అంతగా ప్రభావం చూపదు. పాటల్లో విజయ్‌, అనన్య రొమాన్స్‌ ఆకట్టుకుంటుంది.

లైగర్‌ కోచ్‌గా రోనిత్‌ రాయ్‌ మెప్పించాడు. విషురెడ్డి, అలీ, గెటప్‌ శ్రీనుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికిస్తే.. సంగీతం పర్వాలేదు. పాటలు టాలీవుడ్‌ కంటే బాలీవుడ్‌ ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అవుతారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నతంగా ఉన్నాయి.

టెక్నికల్ గా చూస్తే…

ఈ  సినిమాకు మరో మేజర్ మైనస్… మ్యూజిక్.. రిలీజ్ కు ముందు వచ్చిన రెస్పాన్స్ కు తెరపైకు తేడా కనపడింది. అసలే అంతంత మాత్రంగా ఉన్న సీన్స్ కు ఇవి స్పీడు బ్రేకర్స్ గా మారాయి. సినిమాటోగ్రఫీ నెక్ట్స్ లెవల్‌లో ఉంది. ఎడిటింగ్ పర్లేదు. ఈ విషయంలో జునైద్ వర్క్ బాగానే ఉంది. చివరగా పూరీ జగన్నాథ్ తనకు కావాల్సినంత టైమ్ తీసుకుని.. విజువల్స్ అదరగొట్టారు. యాక్షన్ సీన్స్ చాలా బాగా రాసుకున్నారు. కానీ కథ విషయంలో ఇంకాస్త శ్రద్ధ చూపించి ఉంటే బాగుండేది.

బాగున్నవి..

విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్
యాక్షన్ సీక్వెన్స్ లు
రమ్యకృష్ణ ఫెరఫార్మెన్స్
BGM

బాగోలేనివి ..

ఎన్నో సార్లు చెప్పబడ్డ రొటీన్ కథ
ఇరిటేట్ తెప్పించే స్దాయిలో నత్తిని వాడటం

చివ‌రిగా ..

లైగ‌ర్‌లో.. విజ‌య్‌ క‌ష్టం క‌నిపించింది..అంతే.

Related posts