telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శ్రావణి ఆత్మహత్య కేసులో నిందితులెవరో తేల్చేసిన పోలీసులు

Shravani

బుల్లితెర నటి కొండపల్లి శ్రావణి (26) ఆత్మహత్య కేసు ఆమె స్నేహితులు దేవరాజ్‌రెడ్డి, సాయికృష్ణారెడ్డి (సాయి) చుట్టూనే తిరుగుతోంది. ఈ కేసును ఎస్ఆర్ నగర్ పోలీసులు అనేక కోణాల్లో విచారిస్తున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న దేవరాజ్, సాయికృష్ణలను పోలీసులు ఇప్పటికే విచారించారు. ఈ విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆత్మహత్య వ్యవహారంలో ప్రధానంగా దేవరాజ్‌రెడ్డి, సాయికృష్ణ,‘ఆర్ఎక్స్-100’ సినిమా నిర్మాత అశోక్ రెడ్డి పేర్లు విన్పించాయి. అయితే చివరకు దేవరాజ్, సాయినే నిందితులని పోలీసులు నిగ్గు తేల్చారు. ఇప్పటికే మూడ్రోజుల పాటు దేవరాజును.. ఒక్కరోజంతా సాయిని విచారించిన పోలీసులు పలు కీలక సమాచారాన్ని రాబట్టారు. ఇద్దర్నీ అరెస్ట్ చేసిన పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. అరెస్ట్ అనంతరం డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ మీడియా మీట్ నిర్వహించి నిజానిజాలను వెల్లడించారు.

‘ఈ నెల 8న సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. శ్రావణి 2012లో హైదరాబాద్‌కు వచ్చి టీవీ ఆర్టిస్ట్‌గా నటిస్తోంది. 2015లో సాయికృష్ణారెడ్డి, 2017లో నిర్మాత అశోక్‌రెడ్డితో శ్రావణికి పరిచయం ఏర్పడింది. 2019లో దేవరాజుతో శ్రావణికి పరిచయం ఏర్పడింది. దేవరాజుకు శ్రావణి దగ్గరవుతుందని కుటుంబ సభ్యులకు సాయి చెప్పాడు. దేవరాజుతో శ్రావణి స్నేహంగా ఉండటం సాయికి నచ్చలేదు. దేవరాజుతో పరిచయం తర్వాత గొడవలు పెరిగాయి. దీంతో శ్రావణిని తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టారు. దేవరాజు కూడా పెళ్లి పేరుతో శ్రావణిని మోసం చేశాడు. దేవరాజును పెళ్లి చేసుకుంటుందని శ్రావణిపై తల్లిదండ్రులు, సాయి దాడి చేశారు. గతంలో పంజాగుట్ట పీఎస్‌లో దేవరాజురెడ్డిపై శ్రావణి ఫిర్యాదు చేసింది. సాయి కూడా బెదిరింపులకు దిగే వాడని విచారణలో తేలింది. ఆత్మహత్యకు ముందు దేవరాజుతో శ్రావణి ఫోన్‌లో మాట్లాడింది. ఈ కేసులో శ్రావణి కుటుంబ సభ్యులెవర్నీ నిందితులుగా చూడటం లేదు. శ్రావణి బాగుకోసమే ఆమె కుటుంబ సభ్యులు కొంత ఒత్తిడి తెచ్చారు. నిందితులు ముగ్గురూ శ్రావణిని పెళ్లి చేసుకుంటామని మాటిచ్చారు. పరోక్షంగా, ప్రత్యక్షంగా శ్రావణి ఆత్మహత్యకు ముగ్గురూ కారకులే. ఇలా అందరూ కలిసి వేధించడం వల్లే శ్రావణికి మనస్తాపానికి గురైంది’ అని డీసీపీ మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో A-1సాయికృష్ణ, A-2 దేవరాజు అని డీసీపీ ఏఆర్‌ తెలిపారు. RX100 చిత్ర నిర్మాత అశోక్‌రెడ్డి పరారీలో ఉన్నారన్నారు. ఇవాళ ఉదయం నుంచి అశోక్ రెడ్డి మొబైల్ పనిచేయట్లేదని పేర్కొన్నారు.

Related posts