telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కేవలం డబ్బు వల్లే ఈ సమాజంలో గౌరవం దక్కుతుంది.. .: బ్రహ్మానందం

BRahmanandam

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం డబ్బుల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తారని, పిసినారి అని చాలా మంది అంటుంటారు. అయితే తాను డబ్బు విషయంలో ఇలా ప్రవర్తించడానికి గల కారణాన్ని ఆయన తాజాగా ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. “డబ్బులు ఖర్చుపెట్టడమంటే పార్టీలు ఇవ్వడం, ఫంక్షన్లు నిర్వహించడం, సరదాలు, షికార్లు, పిక్‌నిక్‌లు అని చాలా మందిలో ఒక ఆలోచన ఉంటుంది. అలాంటి వాటితో బ్రహ్మానందం మింగిల్ అవ్వడు. అవ్వకపోవడానికి కారణం ఏంటంటే నాకు డబ్బు విలువ తెలుసు. వడ్రంగం పనిచేసే మా నాన్న.. పది మంది పిల్లల్ని కూర్చోబెట్టి పాఠాలు చెప్పి వాళ్లు ఇచ్చే డబ్బుతో పెద్ద సంసారాన్ని గడిపారు. నా వయసు ఏడెనిమిది సంవత్సరాలు ఉంటుంది. దీపావళి పండుగ వచ్చింది. మా బాధను భరించలేక ఒకసారి నన్ను తీసుకొని ఆయన పనిచేస్తోన్న ఆస్థానం దగ్గరకు వెళ్లారు. మానసికంగా మా నాన్న పడేటటువంటి ఆవేదన చిటికన వేలు పట్టుకుని నిలబడిన పిల్లాడి మీద ప్రతిఫలించింది. నాన్న దయనీయమైన చూపుతో మెట్ల వైపు చూస్తుంటే.. పై నుంచి వస్తోన్న ఆయన ‘ఏవయ్యా నాగలింగం ఏంటి ఇలా వచ్చావ్?’ అంటే.. ‘ఏం లేదండి ఈరోజు దీపావళి కదా పిల్లలు..’ అంటూ మా నాన్న చేతులు నలుపుకుంటూ మాట్లాడుతుంటే.. అరేయ్, ఆయనకి ఏమైనా ఇచ్చి పంపించండి అని యజమాని అన్నప్పుడు.. మా నాన్న ముఖంలో సంతోషం చూశాను. డబ్బులేని తనం, డబ్బులేకపోతే ఎవరిదగ్గరికైనా వెళ్లి దేవిరించినతనం అనే బాధ అప్పటి నుంచి నా కడుపులో ఉండిపోయింది. అంతో ఇంతో డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదిస్తే మనల్ని గౌరవిస్తారు. కేవలం డబ్బు వల్లే ఈ సమాజంలో గౌరవం దక్కుతుంది. అందుకే డబ్బును నేను అంత అతిగా గౌరవించేవాడిని. అనవసరమైన వాటి కోసం నేను దానం చేయను. కుటుంబంలో 23 మంది ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేశాను. నేను చదివించిన ఆరుగురు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు’’ అని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు.

Related posts