telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణకు కేంద్రం అణా పైసా ఇవ్వలేదు..కేటీఆర్‌ ఫైర్‌

కేంద్ర ప్రభుత్వంపై మరోసారి మంత్రి కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి రాష్ట్రానికి అణా పైసా ఇచ్చిన పాపనపోలేదని కేంద్రంపై నిప్పులు చెరిగారు కేటీఆర్‌. ” తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే రాష్ట్రానికి అత్యంత కీలకమైన పారిశ్రామిక రంగంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ కొనసాగుతూ వస్తున్నది. నిజానికి తెలంగాణ ఒక నవజాత శిశువు వంటిది. నూతన రాష్ట్రం తన కాళ్ళ మీద తాను నిలబడడానికి, నిలదొక్కుకోవడానికి అన్ని రకాల సాయం అందించాల్సిన బాధ్యతను కేంద్రం ఆది నుంచి విస్మరించింది. అయినా తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి అద్భుతమైన నాయకత్వ పటిమ మరియు దీర్ఘకాలిక విజన్ తో దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే అభివృద్ధి-సంక్షేమం రెండు ప్రధానమైన అంశాలుగా భావించి ముందుకుపొతున్నది. రాష్ట్రాభివృద్దిలో భాగంగా పారిశ్రామిక రంగానికి అత్యంత అధిక ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్రం ఎర్పడిన తొలినాళ్లలో ఉన్న విద్యుత్ సంక్షోభం నుంచి పరిశ్రమలకు 24 గంటల పాటు కరెంటు సరఫరా అందించే స్థాయికి తెలంగాణ రాష్ట్రం చేరుకుంది. దీంతోపాటు దేశంలో ఎక్కడా లేనివిధంగా టీఎస్ ఐపాస్ వంటి వినూత్నమైన, విప్లవాత్మకమైన పారిశ్రామిక విధానం తీసుకువచ్చి, తెలంగాణను పెట్టుబడుల గమ్యస్ధానంగా మార్చింది. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు తెలంగాణ బాట పట్టేలా కార్యాచరణ చేపట్టింది. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా సింగిల్ విండో అనుమతుల విధానం తీసుకొచ్చి, దాదాపు 15 వేల కంపెనీలు, రెండు లక్షల 12 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రం ఆకర్షించింది. తద్వారా సుమారు 15 లక్షల ఉద్యోగాల కల్పన ఇప్పటిదాకా జరిగింది. గత ఆరేళ్లుగా పారిశ్రామిక రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను, విధానాలను ప్రపంచం మొత్తం అభినందించింది, అంగీకరించింది. ఐటీ పరిశ్రమ నుంచి మొదలుకొని ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్ఫేస్, ఢిపెన్స్ వంటి కీలక రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించింది. కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంక్ కలిసి నిర్వహించే ఈవోడీబీ ర్యాంకింగుల్లో కూడా తెలంగాణ రాష్ర్టం క్రమం తప్పకుండా అగ్రస్థానంలో నిలుస్తు వస్తుంది. రాష్ట్రం ఏర్పడ్డ ఏడేళ్లలోనే తెలంగాణ వ్యవసాయం నుండి ఐటీ వరకు అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి కనబరచింది. జీఏస్ డిపి పెరుగుదలలో దేశంలోనే మేటిగా ఉన్నది. కానీ పనిచేసే ఇటువంటి రాష్ట్రాలను ప్రోత్సాహించడంలో మాత్రం కేంద్రం విఫలమయ్యింది. ఇలా అన్ని రంగాల్లో పెర్ఫామింగ్ స్టేట్ గా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సహాయ సహకారాలు ఎన్నడూ అందలేదు. ఎంతసేపూ కేంద్ర మంత్రులు రావడం, వివిధ వేదికల మీద రాష్ట్రాన్ని ప్రశంసించడం, వెళ్లడం తప్పితే రాష్ట్రానికి అణా పైసా మందం సాయం చేసింది లేదు. కేవలం శుష్కప్రియాలు, శూన్యహస్తాలు తప్ప. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన ప్రాజెక్టులు, పథకాలు, ప్రోత్సాహకాల విషయంలో కేంద్రాన్ని సంప్రదిస్తూనే ఉన్నాం… విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం… అయితే సమయం, సంవత్సరాలు గడుస్తున్నవే కానీ… కేంద్రం నుంచి సానుకూల స్పందన మాత్రం రావడం లేదు. అందుకే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల కోసం మా గొంతును గట్టిగా విప్పాల్సిన అవసరం, సమయం వచ్చింది. ఈ వేధికగా కేంద్రం తెలంగాణకు పారిశ్రామిక రంగంలో చేసిన అన్యాయాన్ని మరోసారి ప్రస్తావిస్తున్నాను…” అంటూ కేటీఆర్‌ విమర్శలు చేశారు.

Related posts