telugu navyamedia
తెలంగాణ వార్తలు

మ‌రికాసేప‌ట్లో ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర..భక్తుల సందడి

ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీపంచముఖ మహాలక్ష్మి గణపతి శోభాయాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుంది. తొమ్మిది రోజులపాటు విశేష పూజలు అందుకున్న మహాగణపతి మరికొన్ని గంటల్లో గంగమ్మ ఒడికి చేరనున్నాడు.

ఈసారి 50 అడుగుల ఎత్తుతో రూపుదిద్దుకున్న మట్టి మహాగణపతి హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి తరలి వెళ్లనున్నాడు. 50 అడుగుల భారీ మట్టి మహాగణపతిని ఊరేగింపుగా నిమజ్జనం చేయడం ఇదే తొలిసారి.

నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా అనుకున్న సమయం కంటే శోభాయాత్ర రెండు మూడు గంటలు ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తుది పూజల అనంతరం గణనాథుడిని మరి కాసేపట్లో ట్రాలీపైకి ఎక్కించనున్నారు. ఖైరతాబాద్‌ భారీ గణనాధుడి నిమజ్జనం కోసం.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల్లో ఉన్న తెలుగువారంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది భక్తులు నిమజ్జన వేడుకను చూసి తరిస్తారు.

గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ఖైరతాబాద్‌ మహాగణపతి బరువు రెట్టింపు అయ్యింది. పూర్తిగా మట్టితో తయారు చేయడంతో మహాగణపతి బరువు 60 నుంచి 70 టన్నులకు చేరింది.

మహాగణపతిని సాగర తీరానికి ప్రత్యేక వాహనంపై తరలిస్తారు. ఈ వాహనం పొడవు 75 అడుగులు, 11 అడుగుల వెడల్పు ఉంటుంది. 26 టైర్లు ఉన్న ఈ వాహనం… 100 టన్నుల బరువు వరకు కూడా మోస్తుంది.

ఎన్టీఆర్‌ మార్గ్‌లో క్రేన్‌ నంబర్‌–4 వద్దకు మహాగణపతి మధ్యాహ్నం చేరుకోగానే వెల్డింగ్‌ తొలగింపు, చివరి పూజలు అనంతరం మధ్యాహ్నం 2 గంటల కల్లా సాగర్‌లో మహా గణపతి నిమజ్జనం కానుంది.

 

 

Related posts