telugu navyamedia
తెలంగాణ వార్తలు

బీజేపీలో చేరిన దాసోజు శ్ర‌వ‌ణ్‌…

*బీజేపీలో చేరిన దాసోజు శ్ర‌వ‌ణ్‌..
*త‌రుణ్ చుగ్ స‌మ‌క్షంలో బీజేపీ కండువా క‌ప్పుకున్న దాసోజు

కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ కమలం గూటికి చేరారు. ఢిల్లీలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ తరుణ్‌ చుగ్‌ సమక్షంలో ఆదివారం బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శ్రవణ్‌కు కషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌, మురళీధర్ రావు, వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు.

కాగా  శనివారం ఢిల్లీలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ తరుణ్‌ ఛుగ్‌తో ఆయన నివాసంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, వెదిరె శ్రీరాంలతో కలిసి దాసోజు భేటీ అయ్యారు.

ప్రజా రాజ్యం పార్టీతో క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన దాసోజు శ్రవణ్.. కొద్ది రోజుల్లోనే మంచి సబ్జెక్ట్ ఉన్న రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కు సన్నిహితంగా ఉన్న శ్రావణ్ సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి 91 వేల ఓట్లు తెచ్చుకున్నారు. తర్వాత మారిన రాజకీయ సమీకరణాల్లో ఆయన ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ లో చేరారు. చేరిన కొద్ది కాలంలోనే ఆయన కేసీఆర్, కేటీఆర్ కు సన్నిహితుడిగా మారారు. టీవీ చర్చల్లో, వివిధ వేదికలపై తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు ఆయన. అయితే.. టీఆర్ఎస్ నుంచి భువనగిరి ఎంపీ టికెట్ ను ఆశించిన శ్రవణ్.. టికెట్ దక్కకపోవడంతో మనస్థాపానికి గురై పార్టీని వీడారు.

Telangana: Dasoju Sravan set to join BJP today, flies to Delhi to meet  Tarun Chugh | Hyderabad News - Times of India

అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి.. అక్కడ కూడా తక్కువ కాలంలోనే అధిష్టానం ఆశిస్సులు పొందారు. దీంతో ఆయనను ఏఐసీసీ అధికార ప్రతినిధిగా నియమించింది హై కమాండ్. గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసే అవకాశాన్ని సైతం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. అయితే.. ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు.

టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో బడుగు బలహీనవర్గాలకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని శ్రవణ్ విమర్శించారు. ఏడాది కాలంగా కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకొన్ను పరిణామాలపై తాను దగ్గరుండి పరిశీలించిన తర్వాత అసంతృప్తితో తాను కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు దాసోజు శ్రవణ్.

ఇటీవల కాలంలో ఖైరతాబాద్ కార్పోరేటర్ పి. విజయా రెడ్డి టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. . విజయా రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై దాసోజు శ్రవణ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పి. విజాయారెడ్డికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ అసెంబ్లీ టికెట్ ఇవ్వనుందనే  ప్రచారం సాగుతుంది.దీంతో మనస్థాపానికి చెందిన శ్రావణ్ కాంగ్రెస్ పార్టీని వీడి ఈ రోజు బీజేపీలో చేరారు

Related posts