అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకు అమరావతి రైతులు చేపట్టే మహాపాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. దరఖాస్తును పరిశీలించి అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది న్యాయస్థానం.
ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదం ఉందన్న కారణంతో పాదయాత్రకు అనుమతి ఇవ్వలేమంటూ గురువారం అర్థరాత్రి డీజీపీ ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో వేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు పరిమిత ఆంక్షలతో పాదయాత్ర కొనసాగించవచ్చని సూచించింది.
రాజకీయ నాయకులు వేల మందితో పాదయాత్ర చేయొచ్చు కానీ.. 600 మంది రైతుల చేయకూడదా అని పోలీసులను ధర్మాసనం ప్రశ్నించింది.
ఢిల్లీలో సమస్యలపై వేలాది మంది ర్యాలీలు చేస్తుంటే.. అక్కడి పోలీసులు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నారని.. ఇక్కడ 35 వేల మంది రైతుల్లో కేవలం 600 మంది చేస్తున్న పాదయాత్రకు బందోబస్తు కల్పించలేరా అని సీరియస్ కామెంట్స్ చేసింది.
పోలీసులకు ఇప్పుడే దరఖాస్తు చేసుకోవాలని రైతులను హైకోర్టు ఆదేశించింది. దరఖాస్తు పరిశీలించి అనుమతులు ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.