telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

చర్చల పై సమీక్షలో కేసీఆర్ .. రేపటికి సన్నద్ధం.. అద్దెబస్సులకు గ్రీన్ సిగ్నల్..

kcr meeting on tsrtc protest report

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ కార్మిక సంఘాలతో నిర్వహించిన చర్చల సారాంశాన్ని అడిగి తెలుసుకున్నారు. అలాగే సమ్మెపై సోమవారం హైకోర్టుకు నివేదించాల్సిన అంశాలు కూడా చర్చకు వచ్చాయి. తాజా పరిణామాల నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆర్టీసీ కార్మికులతో యాజమాన్యం చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో… చర్చల సారాంశాన్ని అధికారులు సీఎం కేసీఆర్‌కు నివేదిక ఇచ్చారు. హైకోర్టులో ప్రభుత్వం తన వాదనలు వినిపించాల్సి ఉండటంతో సీఎం కేసీఆర్‌ మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతేకాకుండా కోర్టులో తదుపరి వాదించాల్సిన అంశాలపై న్యాయ నిపుణులు, అధికారులతో కేసీఆర్‌ చర్చించారు.

ప్రభుత్వం సమ్మెపై తాడోపేడో తేల్చుకునేందుకే సిద్ధమవుతోంది. ఉద్యోగ సంఘాల నేతలతో చర్చల సందర్భంగా ప్రస్తావించిన అంశాలను ప్రభుత్వం రికార్డ్‌ చేయించింది. ఇవే రికార్డులను కోర్టుకు కూడా సమర్పించేందుకు సర్కార్‌ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని డిమాండ్లను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆర్ధికంగా భారం కాని 12 డిమాండ్లను నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని కోర్టుకు తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంస్థ పరిస్థితిపై పూర్తి నివేదికతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఆర్టీసీ సంస్థల తీరును కూడా కోర్టుకు తెలియజేయాలని సర్కార్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమీక్షలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎం కేసీఆర్‌. ప్రత్యామ్నాయ చర్యలు వేగవంతం చేస్తూనే ఆర్టీసీలో అద్దె బస్సులను పెంచేందుకు మరిన్ని నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రైవేట్ రూట్లపై త్వరలో సర్వే నిర్వహించి.. రూట్లు, విధి విధానాలపై కసరత్తు చేయాలని కేసీఆర్‌ ఆదేశించారు.

Related posts