telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కెసీఆర్ ఔట్… ఇప్పుడు మరో డౌట్…!?

భారత రాజకీయాల్లో కేసీఆర్ ను మించి కుటుంబపాలన సాగించిన వ్యక్తి మరొకరు లేరు…అధికార మదం పూర్తిగా తలకెక్కి తాను ఏం చేసినా చెల్లిపోతుందనే ధోరణితో గతంలో మహానేతలు ఎందరో ఎదుర్కొన్న చీత్కారాలను తలకెక్కించుకోక ఒక నియంత మాదిరి పదేళ్ల పాటు ఏలుబడి సాగించి ఎందరి పోరాట ఫలంగానో సాధించుకున్న తెలంగాణ తన సొంత జాగీరన్నట్టు.
విర్రవీగిపోయి తన కుటుంబ బలిమిని…సంపదను పెంచుకుని… ఇవి చాలవన్నట్టు జాతీయ రాజకీయాలను కూడా ఏలుదామని అత్యాశతో తల్లి తెలంగాణ ప్రయోజనాలను పక్కనపెట్టేసిన అభినవ నైజాముకు తెలంగాణ ప్రజలు ఓటుతో గట్టిగా బుద్ధి చెప్పారు…

ఏకచత్రాధిపత్యంగా జీవిత పర్యంతం తెలంగాణను ఏలుదామనుకున్న చంద్రశేఖర రావు చివరకు తానే ఓటమి పాలై అతి భయంకర చేదు అనుభవంతో తెలంగాణ గద్దెను విడిచిపెడుతున్నారు. నిజానికి తెలంగాణ వచ్చింది కేసీఆర్ ఒక్కడి వల్లనే కాదు. ఆ విషయం కేసీఆర్ కి ఎప్పుడో తెలిసినా తెలంగాణ ప్రజలకి పదేళ్ళకు ఎరుకైంది. తెలంగాణ ఎవరి వల్ల వచ్చిందో ఆ రాష్ట్ర ప్రజలు ఇన్నాళ్లకు గుర్తించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు.కష్టాల్లో ఉన్న సోనియాకి పట్టాభిషేకం చేశారు…

కర్ణుడి చావుకి కారణాలు అనేకం అన్నట్టు ఈరోజున కేసీఆర్ శృంగభంగానికి దారితీసిన పరిస్థితులు ఎన్నెన్నో…అయితే అన్నిటినీ మించి ముందే చెప్పుకున్నట్టు కుటుంబ ఆధిపత్యం.
ఆపై పెరిగిపోయిన నియంతృత్వ ధోరణి.ఒంటెద్దు పోకడలు. మితిమీరిన అహంకారం.ఉద్యమంలో తనతో పాటు. ఒకరకంగా తన కంటే కూడా ముందుగా పాల్గొన్న వారందర్నీ కాదని తన ఒక్కడి వల్లనే తెలంగాణ వచ్చినట్టు. ఆ ఫలితాన్ని అధికారం రూపంలో తాను…తన కుటుంబం మాత్రమే అనుభవించాలన్న స్వార్థం.
ఇలా ఎన్నో. ఎన్నెన్నో
పెడ బుద్ధులు.!

సరే…ఈ తరహా పోకడలన్నిటికీ తెలంగాణ ప్రజలు చరమగీతం పలుకుదామనుకున్నారు.
అయిదేళ్ల క్రితమే చేయాల్సింది. కానీ మరో అవకాశం ఇచ్చారు.మార్పు లేకపోగా రెండో గెలుపుతో
బలుపు మరింత పెరిగింది.
వాపు బలుపనిపించింది.

దాన్ని జాతీయ స్థాయికి విస్తరిద్దామన్న అత్యాశ పెరిగిపోయింది.వీటికి తోడు కవిత ఆగడాలు మరింత
శాపంగా పరిణమించాయి. తెలంగాణ ప్రజలకు కనీసం కెటిఆర్ మొహం చూసైనా టిఆర్ఎస్ కు ఓటు వేయాలని అనిపించలేదు. అంతగా వ్యామోహం నశించిపోయింది కేసీఆర్ అన్నా…ఆయన పార్టీ అన్నా. ఇది కెటిఆర్ కు పెద్ద ఎదురుదెబ్బ…ఆశాభంగం.

సరే. ఇప్పటికి కేసీఆర్ కథ ముగిసినట్టే. జాతీయ రాజకీయాల్ని ఏలుదామన్న ఆయన కల కూడా కరిగిపోయినట్టే.
కం బ్యాక్ కూడా కష్టమే.యధావిధిగా కాంగ్రెస్ తన పాత ధోరణిలోనే పాలన సాగిస్తే అప్పుడు చూడవచ్చు. ఇప్పటికి టీఆరెఎస్ కథ కంచికే.పార్లమెంటు ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే వ్యవధి ఉన్న దశలో తెలంగాణలో విజయం హస్తం పార్టీకి పెద్ద ఊపిరి.మిగిలిన వ్యవధిలో అద్భుతాలు సాధించలేకపోయినా పదవుల కోసం కొట్టుకొడాలు. అలకలు. ఫిరాయింపులు. వెన్నుపోటు వంటి అలవాటైన పోకడలకు పోకుండా చక్కని పాలన అందించి మేము మారాము సుమా. అని చెప్పగలిగితే అది దేశ ప్రజలకి కాంగ్రెస్ ఇచ్చే సమతానుకూల సందేశం అవుతుంది.అది పార్లమెంట్ ఎన్నికలకి పనికి రావచ్చు.

ఇక్కడ మరొక మాట.
మొన్న తెలంగాణ పోలింగ్ ముగిసి ఫలితంపై ఓ మోస్తరు అంచనా వచ్చినప్పటి నుంచి ఆంధ్రలో ఒక అభిప్రాయం గట్టిగానే వినిపిస్తోంది.
తెలంగాణలో మార్పు జరిగితే
ఆంధ్రలో కూడా అదే కథని.
ఏమో. కేసీఆర్ కథ ఇప్పుడు ఆంధ్రలో ఏలుబడి సాగిస్తున్న వ్యక్తికే కాదు…
ఒకవేళ అనుకున్నట్టు
మార్పు జరిగి అధికారంలోకి వస్తారు అనుకునే నేతకైనా
పాఠమే అవుతుంది.
తలపొగరు పెరిగి. తప్పులు మీద తప్పులు చేస్తూ…ఏం చేసినా జనం ఓటు వేస్తారు అనుకునే ఎవరికైనా ఇలాంటి అనుభవాలే తప్పవు.కేసీఆర్ కావచ్చు. జగన్ అవొచ్చు.
చంద్రబాబే అనుకోవచ్చు.
మరోనాటికి మోడీనే అయి ఉండవచ్చు ప్రజాభీష్టానికి…ప్రజల ఆశలకు అనుగుణంగా నడుచుకోలేదంటే శృంగభంగం తప్పదు. ఖబడ్దార్.
ప్రజలు తెలివి మీరారు.
ఓటరు జాగృతం అవుతున్నాడు.ఇది గుర్తెరిగి జర భద్రం కొడకో.
మహా మహా చక్రవర్తులకే
దిక్కు లేని చరిత్రను
చూసిన దేశం మనది.

Related posts