తెలంగాణ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 12వ బెటాలియన్‌కు చెందిన వెంకటేశ్వర్లు ఏకే 47 తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆయనను అక్కడి సిబ్బంది వెంటనే గజ్వేల్ ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు.
వెంకటేశ్వర్లు స్వస్థలం యాదాద్రి జిల్లా వలిగొండ గ్రామం అని తెలిసింది. అయితే, ఆయన మద్యానికి బానిసయ్యాడని సిద్దిపేట అదనపు డీసీపీ నర్సింహారెడ్డి తెలిపారు. ఆయన కొంత కాలం సెలవులు తీసుకొని ఇటీవలే తిరిగి విధుల్లో చేరారని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆయన మద్యం మత్తులోనే ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు.