telugu navyamedia
రాజకీయ

ఝార్ఖండ్‌ సీఎంకు బిగ్ షాక్.. ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఝార్ఖండ్‌ సీఎం హేమంత్ సోరెన్ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేస్తున్నట్లుగా ఎన్నికల కమిషన్ ప్ర‌క‌టించింది.

గనుల కేటాయింపు వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన శాసనసభ సభ్యత్వాన్ని గవర్నర్ రద్దు చేశారు. ఎన్నికల కమిషన్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సోరెన్ ఎమ్మెల్యే హోదా కోల్పోయారు.

అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో సీఎం సోరెన్‌కు సంబంధాలున్నట్లు తేలినందున ఆయన ఎమ్మెల్యే పదవి రద్దు చేయాలని ఎన్నికల సంఘం గవర్నర్‌కు సూచించింది.ఈ నేపథ్యంలోనే గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. శాసనసభ సభ్యత్వం రద్దయినా.. సోరెన్‌ సీఎంగా కొనసాగవచ్చు. యూపీఏ మిత్రపక్షాలు ఆయనకు మద్దతు తెలిపితే సరిపోతుంది. అయితే మరో ఆరు నెలల్లోగా ఆయన శాసనసభకు తిరిగి ఎన్నిక కావాల్సి ఉంటుంది.

మైనింగ్ శాఖ బాధ్యతలు చూస్తున్న సోరెన్.. తనకు తానే లీజు మంజూరు చేసుకోవడం ద్వారా అధికారాన్ని దుర్వినియోగం చేశారంటూ బీజేపీ సీనియర్ నేత రఘుబర్ దాస్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఈసీ అభిప్రాయాన్ని కోరారు జార్ఖండ్ గవర్నర్ రమేశ్ బైస్. దీనిలో భాగంగా హేమంత్ సోరెన్‌ను తొలగించాలని ఈసీ… గవర్నర్‌కు సిఫారసు చేసింది.

Related posts