జమ్ముకశ్మీర్ ప్రభుత్వం భారత వాయుసేన సహకారంతో అమర్‌నాథ్ యాత్రికులను తరలించాలని కేంద్రాన్ని అభ్యర్థించింది. కశ్మీర్ నుంచి జమ్ము, పఠాన్‌కోట, దిల్లీకి వారిని తీసుకెళ్లాలని కోరింది. ‘సీ 17 విమానం ద్వారా అమర్‌నాథ్ యాత్రికులను తరలించాలని రాష్ట్ర యంత్రాంగం కోరింది. సీ 17కు చెందిన మొదటి విమానం రెండు గంటల్లో కశ్మీర్ నుంచి వచ్చే అవకాశం ఉంది’ అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు మీడియాకు వెల్లడించాయి.
ఉగ్రదాడులు జరుగుతాయన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా దేశం నలుమూల నుంచి పారామిలిటరీ దళాలను ఈ విమానాలు కశ్మీర్ లోయకు తరలించే పనిలో ఉన్నాయి. రష్యన్ ఇల్యూషిన్-76 కంటే తక్కువ సమయంలోనే గమ్యస్థానానికి చేరే ఈ విమానానికి ఒకేసారి 230 మందిని తరలించే సామర్థ్యం ఉంది. యాత్రికులు సాధ్యమైనంత త్వరగా యాత్రను ముగించుకొని వెనక్కి వెళ్లిపోవాలని జమ్ముకశ్మీర్ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.