telugu navyamedia
సినిమా వార్తలు

తెలుగు చిత్రసీమకు ఐపీఎల్ భయం

IPL-2019

క్రికెట్‌ పండుగ ఐపీఎల్ కు సమయం ఆసన్నమైంది. నేటి నుంచే ఐపీఎల్‌ 12వ సీజన్‌ ఆరంభం కానుంది. ఇక క్రీడాలోకమంతా ఐపీఎల్‌ ఫీవర్‌తో మునిగిపోనుంది. నాలుగేళ్లకోసారి వచ్చే వన్డే ప్రపంచకప్‌ కన్నా ఏడాదికోసారి వచ్చే ఐపీఎల్‌ పైనే ఆసక్తి పెరిగింది. ఈ సీజన్‌ ఆరంభ మ్యాచ్‌ చెన్నై సూపర్‌ కింగ్స్(సీఎస్కే), రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ)మధ్య చెన్నై చిదంబరం స్టేడియంలో జరగనుంది. దీంతో దర్శకనిర్మాతల గుండెల్లో గుబులు మొదలైంది.

ఎందుకంటే ఐపీఎల్ వచ్చిందంటే సినిమా కలెక్షన్లపై ఆ ప్రభావం తప్పకుండా పడుతుంది. ఐపీఎల్ స్టార్ట్ అయ్యిందంటే చాలు అందరూ కలిసి హ్యాపీగా టీవీల ముందు కూర్చుని ఆటను ఎంజాయ్ చేస్తారు. ఇక దర్శకనిర్మాతలకు నష్టాలు తప్పవు. మార్చ్ 23 నుంచి ఐపీఎల్ 12వ సీజన్ ప్రారంభమై మే 12న పూర్తి కానుంది. అంటే ఏప్రిల్, మే నెలల్లో విడుదల కాబోయే అన్ని సినిమాలపై ఐపీఎల్ ప్రభావం పడనుంది. దీనికి తోడు ఈసారి బోనస్ గా ఎన్నికలు కూడా వచ్చాయి. మార్చ్ 29న లక్ష్మీస్ ఎన్టీఆర్, ఏప్రిల్ 5న మజిలీ, 12న చిత్రలహరి, 19న జెర్సీ, 25న బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ “సీత”, మే 9న మహర్షి… లాంటి సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఒకవైపు ఎన్నికలు… మరోవైపు ఐపీఎల్… మధ్యలో సినిమాలు… ఏం జరుగుతుందోనని దర్శకనిర్మాతలు కంగారు పడుతున్నారు. మరేం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

Related posts