ప్రజా సమస్యలను నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించేందుకు వార్డు వ్యవస్థను నగర వ్యాప్తంగా 150 డివిజన్లలో ప్రారంభోత్సవం చేశామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. వార్డు కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా శుక్రవారం జూబ్లీహిల్స్ సర్కిల్ సి.ఎం.టి.ఇ.ఎస్ భవనంలో ఏర్పాటు చేసిన బంజరాహిల్స్ వార్డు కార్యాలయం, హిమాయత్ నగర్ మేల్ కోటి పార్కు లో ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయం, ఎల్బీనగర్ లింగోజిగూడ, రామంతాపూర్ వివేక్ నగర్ లలో ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాలను నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు.
ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ… దేశంలో ఎక్కడా లేని విధంగా జిహెచ్ఎంసి పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం వార్డు వ్యవస్థను అమల్లోకి తెచ్చిందన్నారు. మెరుగైన పాలనతో సంక్షేమం, అభివృద్ధి లో ముందంజలో ఉందన్నారు. ప్రధాన కార్యాలయం, జోన్, సర్కిల్ కార్యాలయాలతో పాటు వార్డు కార్యాలయాలను సిటీజన్స్ కు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. 40 వేల జనాభాకు ఒక వార్డును ఏర్పాటు చేశామని తెలిపారు.
వార్డు కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వార్డు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, వార్డు ఇంజనీర్, వార్డు యు.బి.డి సూపర్ వైజర్, విద్యుత్, శానిటరీ జవాన్, టౌన్ ప్లానర్, కమ్యునిటీ ఆర్గనైజర్, జలమండలి, ఎంటమాలజీ, కంప్యూటర్ ఆపరేటర్ లతో కూడిన పది మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారని తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి కార్యాలయాల చుట్టూ తిరగకుండా అన్ని శాఖల సిబ్బంది తో వార్డు కార్యాలయం ఏర్పాటు చేశామని తెలిపారు. వార్డు వ్యవస్థలో ప్రజా సమస్యలను కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా రిజిస్టర్ చేయబడి సంబంధిత శాఖ అధికారికి వెంటనే ఫార్వర్డ్ చేయబడుతుంది. సిటీజన్ చార్టర్ ను అనుసరించి సమస్యలను సత్వరమే పరిష్కరిస్తారని తెలిపారు. సమస్య పరిష్కారంలో అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. వార్డు వ్యవస్థ కొలువు తీరడానికి కొంచెం సమయం పడుతుందన్నారు.
ఏ ప్రాంతం నుండి అయినా వచ్చిన ఫిర్యాదు తిరిగి పంపకుండా సంబంధిత అధికారులకు బదలాయింపు చేయాలన్నారు. వార్డు స్థాయిలో శానిటేషన్ ద్వారా రోడ్లు క్లీన్ చేయకపోయినా, స్ట్రీట్ లైట్ నిర్వహణ, క్యాచ్ పిట్ వంటి సమస్యల పై వేగవంతంగా స్పందించి సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలన్నారు. రోడ్ల పై ఏర్పడిన గుంతలను, సిల్ట్, క్యాచ్ పిట్ సమస్యలను 24 గంటలలోగా పరిష్కరించాలని, నీటి నిల్వ, స్ట్రామ్ వాటర్ తొలగింపు వంటివి 48 గంటలలో, ఫుట్ పాత్ రిపేర్స్ 72 గంటలలోపు, రోజువారీగా ఇంటింటి నుండి చెత్త సేకరణ చేయాలని తెలిపారు. యాంటీ లార్వా ఆపరేషన్స్ 24 గంటలలోపు నిర్వహించాలని తెలిపారు. పెట్ డాగ్స్ లైసెన్సులను 7 రోజుల్లో అందజేయాలని, చనిపోయిన జంతువులను 24 గంటలలోపు తీసివేయాలని తెలిపారు. ఆసరా వికాసం ద్వారా సీనియర్ సిటీజన్స్, దివ్యాంగులకు ఐ.డీ కార్డులను 15 రోజుల్లోగా సమస్యలను పరిష్కరించాలని తెలిపారు.
వార్డు స్థాయిలో పరిష్కరించబడని సమస్యలను సర్కిల్, జోన్ కార్యాలయాలకు ఫార్వర్డ్ చేయాలని తెలిపారు. వార్డు స్థాయి సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్ సహాయం తీసుకోవాలని తెలిపారు. హిమాయత్ నగర్ వార్డు కార్యాలయాన్ని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో కలిసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు.
ఈ సమావేశంలో హిమాయత్ నగర్ కార్పొరేటర్ గడ్డం మహాలక్ష్మి, లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, రామంతపూర్ కార్పొరేటర్ శ్రీవాణి, బంజారాహిల్స్ డివిజన్ వార్డు కార్యాలయం సిబ్బంది ఏ.ఎం.సి శ్రీనివాస్, వాటర్ వర్క్స్ కరీం, ఎంటమాలజి శ్రీనివాస్, యు.బి.డి పవన్, ఇంజనీర్ ప్రశాంత్, టౌన్ ప్లానర్ సాత్విక, విద్యుత్ రాజు, శానిటరీ జవాన్ రమేష్ కుమార్, కమ్యునిటీ ఆర్గనైజర్ బావ్ సింగ్, కంప్యూటర్ ఆపరేటర్ సిద్దార్థ్, హిమాయత్ నగర్ వార్డు సిబ్బంది, లింగోజిగూడ వార్డు సిబ్బంది, రామంతాపూర్ వార్డు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.