తమిళ మాస్ హీరో విజయ్‌పై ఐటీ అధికారులు దాడులు చేయడంతో తమిళ పరిశ్రమలో కలకలం రేపింది. ప్రముఖ నటుడు, దళపతి విజయ్ కు సంబంధించి రెండో రోజూ కూడా చెన్నై, మధురైలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బుధవారం (ఫిబ్రవరి 05,2020) షూటింగ్ స్పాట్ కెళ్లి మరీ విజయ్ ని విచారించిన అధికారులు.. ఇప్పుడు చెన్నైలోని విజయ్ నివాసాలను టార్గెట్ చేశారు. విజయ్ ఇళ్లలో అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఇక ఉదయాన్నే విజయ్ ఇంటికి చేరుకున్న ఐటీ అధికారులు.. ఆయనను నిర్విరామంగా విచారిస్తున్నారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో హీరో విజయ్ ని 20 గంటలుగా హీరో విజయ్ ని ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో విజయ్ ఇంటికి చేరుకుంటున్నారు. దీంతో విజయ్ ఇంటి దగ్గర భద్రత భారీగా పెంచారు. ఈ పరిణామాలతో విజయ్ నివాసం దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏజీఎస్ సంస్థ ఇటీవలే విజయ్, యువ దర్శకుడు అట్లీ కలయికలో ‘బిగిల్’ చిత్రాన్ని నిర్మించింది. స్పోర్ట్స్ అండ్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలవడమే కాక సుమారు రూ.250 నుండి రూ.300 కోట్ల మేరకు వసూళ్లు సాధించినట్లు తెలిసింది. ఈ సినిమా లావాదేవీలకు సంబంధించి ఐటీ అధికారులు ప్రశ్నలు సంధిస్తున్నారు. మధురైలో ఏజీఎస్ సినిమాస్, ఫిలిమ్ ఫైనాన్షియర్ అన్బు చెలియాన్ ఆస్తులపైనా విచారణ జరుపుతున్నారు.
చిత్ర నిర్మాణ సంస్థ.. AGS సినిమా, డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్, ఎంటర్ టైన్స్ మెంట్స్ సంస్థపైనా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. చెన్నైలో ఏక కాలంలో 20 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. చెన్నైలోని ఏజీఎస్ కార్యాయలంలో రూ.24 కోట్లు, మరో చోట రూ.50కోట్లకు పైగా అక్రమాస్తులను ఐటీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. బిగిల్ సినిమా బడ్జెట్ నుంచి కలెక్షన్స్ వరకు అన్ని విషయాల్లో అక్రమాలు జరిగినట్టు గుర్తించిన అధికారులు ఈ సోదాలు చేపట్టినట్టు తెలుస్తోంది. కాగా ఈ ఐటీ రైడ్స్ రాజకీయ రంగు పులుముకుంది. హీరో విజయ్ ని బీజేపీ టార్గెట్ చేసిందని అభిమానులు ఆరోపిస్తున్నారు. గత 3 సినిమాల్లో బీజేపీ టార్గెట్ గా విజయ్ పొలిటికల్ సెటైర్లు వేశారు. ఈ కారణంతోనే తమ హీరోని బీజేపీ టార్గెట్ చేసింది, ఐటీ దాడులతో కక్ష తీర్చుకుంటున్నారని అభిమానులు అంటున్నారు. మొత్తంగా కోలీవుడ్ లో ఐటీ రైడ్స్.. సినీ వర్గాల్లోనే కాదు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారాయి. బుధవారం(ఫిబ్రవరి 05,2020) మొదలైన ఐటీ సోదాలు గురువారం కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం విజయ్ మాస్టర్ సినిమా షూటింగ్‌లో నటిస్తున్నారు. లోకేష్ కనగరాజన్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. చెన్నైలో షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ స్పాట్ కి వెళ్లి మరీ విజయ్‌ని ఐటీ అధికారులు విచారించారు. బిగిల్ సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ తో పాటు ఇతర లావాదేవీలపై ప్రశ్నిస్తున్నారు. దీంతో ప్రస్తుతం షూటింగ్ నిలిచిపోయింది. ఇక 2017లో వచ్చిన మెర్సల్ సినిమా సంస్థతో సంబంధం ఉన్న పన్ను ఎగవేత కేసుకి సంబంధించి ఐటీ అధికారులు విజయ్ ని ప్రశ్నిస్తున్నారట. ఆ సినిమాలో జీఎస్టీని హేళన చేస్తూ డైలాగ్స్ ఉన్నాయి. దీనిపై బీజేపీ నేతలు అప్పట్లోనే తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. కాగా కొద్ది రోజుల ముందు కర్నాటకలోని విరాజ్ పేటలో హీరోయిన్ రష్మిక మందన్న ఇంటిపైనా ఐటీ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. లెక్కకు రాని డాక్యుమెంట్లను, ఆస్తులను, నగదుని వారు స్వాధీనం చేసుకున్నారు.