telugu navyamedia
తెలంగాణ వార్తలు

హైటెక్ కు .. మెట్రో నెలాఖరు నుండే.. రివర్సల్ తో వచ్చింది తిప్పలు…

hightech city metro by this month last week

హైదరాబాద్ లో హైటెక్ సిటీ కి మెట్రో ఎప్పుడా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్న ప్రయాణికుల ఆశలకు రెక్కలు వచ్చేశాయి.. ఈ నెలాఖరుకల్లా అందుబాటులోకి రానున్నట్టు నిర్వాహకులు చెపుతున్నారు. దీనికోసమే, అమీర్‌పేట-హైటెక్‌సిటీ మార్గంలో ఈ నెలాఖరు నుంచి మెట్రోరైలు పరుగుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రయోగాత్మక పరుగు (ట్రయల్‌ రన్‌) కొలిక్కి రావడంతో భద్రతాపరమైన తనిఖీలు చేపట్టాల్సి ఉంది. ఈ తనిఖీలు నిర్వహించాలని కమిషనర్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ (సీఎంఆర్‌ఎస్‌)ని నిర్మాణ సంస్థ కోరినట్లు సమాచారం. ఇప్పటివరకు ప్రారంభించిన మెట్రో మార్గాలతో పోలిస్తే హైటెక్‌ సిటీ మార్గం క్లిష్టమైనది కావడంతో … మరింత క్షుణ్నంగా సీఎంఆర్‌ఎస్‌ తనిఖీలు చేయనున్నారు. అనంతరం ఆయన సూచించిన ప్రకారం భద్రత చర్యలను పటిష్ఠం చేశాక అనుమతి మంజూరు చేస్తారు. ఈలోపు రాష్ట్రంలో మంత్రివర్గం కొలువుదీరితే.. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ అనుమతితో ప్రారంభ తేదీ నిర్ణయించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

సాధారణంగా మెట్రో రైళ్లు ఒక ట్రాక్‌లో వెళితే.. మరో ట్రాక్‌లో తిరుగు పయనం అవుతాయి. అమీర్‌పేట-హైటెక్‌ సిటీ మార్గంలో ప్రస్తుతానికి ఇది సాధ్యపడదు. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు స్టేషన్‌ సమీపంలో రివర్సల్‌ ఉండటంతో ఇక్కడి వరకు ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత నాలుగు స్టేషన్లు పెద్దమ్మగుడి, మాదాపూర్‌, దుర్గం చెరువు, హైటెక్‌ సిటీ వరకు మాత్రం ట్విన్‌ సింగిల్‌ లైన్‌లోనే మెట్రోలు వెళతాయి. అంటే వెళ్లిన లైన్‌లోనే తిరిగి చెక్‌పోస్టు వరకు వెనక్కి మళ్లుతాయి. నాలుగు స్టేషన్లే కాబట్టి మెట్రో వేళల్లోనూ పెద్ద జాప్యమేమి ఉండదని అధికారులు అంటున్నారు.

* ప్రస్తుతం నాగోల్‌ నుంచి అమీర్‌పేట వరకు 7 నిమిషాలకో మెట్రో నడుస్తోంది. ఇదే మెట్రో హైటెక్‌ సిటీ వరకు వెళుతుంది.
* ప్లాట్‌ఫాం ఒకటి వైపు ఉన్న ట్రాక్‌పై నాగోల్‌ నుంచి వచ్చే మొదటి మెట్రో ఎలాంటి ఆటంకం లేకుండా హైటెక్‌ సిటీ చేరుకొంటుంది.
* దీని వెనక వచ్చే రెండో మెట్రో రైలు జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వద్ద ట్రాక్‌ మారి రెండో లైనులో వెళుతుంది.
* ఈలోపు మొదటి మెట్రో మొదటి ట్రాక్‌లోనే తిరుగుపయనమై జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వద్ద రెండో ట్రాక్‌లోకి మారి నాగోల్‌కు చేరుతుంది.
* ఈ నాలుగు స్టేషన్ల పరిధిలో ప్రయాణికులు వెళ్లడానికి, రావడానికి ఏ ప్లాట్‌ఫామ్‌నైనా వినియోగించుకోవచ్చు.
* జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి హైటెక్‌ సిటీకి వెళ్లడానికి ఎనిమిది నుంచి పది నిమిషాలు పడుతుంది. వెళ్లిన ట్రాక్‌లోనే తిరిగి రావాలి కాబట్టి మరో 10 నిమిషాలు ఎదురుచూడాలి. ఆ ప్రకారం ఇప్పుడున్న 7 నిమిషాల్లో కాకుండా ఈ స్వల్ప దూరంలో మెట్రో కోసం కనీసం పది నిమిషాలైనా ఎదురు చూడాల్సి ఉంటుంది.

Related posts