ఇటీవల భారీ వర్షాలకు ప్రమాదస్థాయిలో ప్రవహించిన గోదావరి వరద ప్రవాహం నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. భద్రాచలం వద్ద మంగళవారం సాయంత్రం 4 గంటలకు గోదావరి నీటిమట్టం 23.4 అడుగుల వద్ద నిలకడగా ప్రవహిస్తున్నది. జూలై చివరి వారం నుంచి ఎగువన కురుస్తున్న వర్షాలతో ఒక్కసారిగా పెరుగుతూ వచ్చిన గోదావరి తగ్గుతూ వస్తోంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఎగువన ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలతో పాటు జిల్లాలో కురిసిన వర్షాలకు ఒక్కసారిగా గోదావరికి వరద ప్రవాహం వచ్చిపడింది.
ఇప్పటికే రెండు సార్లు 48 అడుగులకు పైగా గోదావరి ప్రవహించడంతో జిల్లా అధికారులు రెండుసార్లు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అనంతరం గోదావరి క్రమక్రమంగా తగ్గుముఖం పట్టడంతో జిల్లా అధికారులతో పాటు గోదావరి పరివాహక ప్రాంత పల్లెల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.