telugu navyamedia
తెలంగాణ వార్తలు

రేవంత్‌రెడ్డే సర్దుకుపోవాలి, శశిధర్‌రెడ్డిది ఆవేద‌న‌ -రేణుకా చౌదరి

తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూరే కారణమంటూ ఆ పార్టీ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై తాజాగా ఆ పార్టీ కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి స్పందించారు.

మర్రి శశిధర్‌రెడ్డి చాలా ఓపికతో ఉండే వ్యక్తి అని, ఆయనకు ఏదో మనసుకు బాధ అనిపించి మాట్లాడి ఉంటారని తెలిపారు. ఈ విషయంలో రేవంత్‌రెడ్డే సర్దుకోవాలని సూచించారు. అన్ని పార్టీల్లో మనస్పర్ధలు ఉంటాయని, త్వరలోనే పరిస్థితి చక్కబడుతుందని పేర్కొన్నారు. ఇక మునుగోడులో కాంగ్రెస్ గెలుస్తోంద‌ని అన్నారు.

కాంగ్రెస్‌లో పరిణామాలు సహజమని, కొత్తేం కాదని రేణుక చౌదరి తెలిపారు. బీజేపీలో కూడా చాలా సమస్యలు, నేతల మధ్య విబేధాలు ఉన్నాయన్న మాజీ మంత్రి.. నితిన్‌ గడ్కరీ లాంటి వాళ్లనే బీజేపీ పక్కన పెట్టిందని ప్రస్తావించారు. పార్టీలో సీనియర్లను అవమానించే శక్తిమాన్‌ ఎవరూ లేరని స్పష్టం చేశారు.

పార్టీలో తమను అవమానించేవారెవరూ లేరని… అవమానిస్తే దుమారం ఎలా లేపాలో కూడా తమకు తెలుసునని పేర్కొన్నారు. ఖమ్మంలో తనను ఎదురించే మొనగాడు ఎవరూ లేరన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్లడం బాధాకరమని, మునుగోడులో కాంగ్రెస్‌ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు.

Related posts