తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ, సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి స్థానం లేదని, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు వారి కుటుంబ సభ్యలే ఓటు వేసే పరిస్థితి లేదన్నారు.
ప్రచారంలో ప్రభుత్వ పథకాల గురించి ప్రజలే మాకు వివరిస్తున్నారని, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ వస్తేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. మున్సిపాలిటీల్లో పాలకవర్గాలు లేకపోవడంతో నిధులు ఖర్చు చేయలేదని పేర్కొన్నారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఓటర్లను ఉద్దేశించి ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీరు ఎవరికి ఓటు వేసినా తనకు తెలిసిపోతుందని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. వేరే పార్టీకి ఓటు వేసి ఆ తర్వాత బాధపడితే లాభం లేదని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న టీఆర్ఎస్ కే ఓటు వేయాలని కోరారు. టీఆర్ఎస్ కు ఓటు వేస్తేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు.