మంచి కంటే చెడుకే టెక్నాలజీ వాడుతున్నారు అన్నది ఎంత నిజమో కానీ, ఈ అమాయకుడు మాత్రం తనకు రావాల్సిన పదోన్నతి కోసం తన పై అధికారికే లంచం ఇస్తాను అని మెసేజ్ పెట్టేశాడు. ఎవరిని నమ్మలేక ఇలా చేస్తున్నానని, ఎప్పటి నుండో పదోన్నతి కోసం ఎదురుచూస్తున్నామని, అది తనకే దక్కాలని, అందుకే లంచం కూడా ఇవ్వడానికి సిద్ధం అని ఆ మెసేజ్ లో తన బాధను వ్యక్తం చేశాడు. అయితే సరాసరి ఉన్నత అధికారికి ఇలా మెసేజ్ చేసినందుకు వెంటనే ఆయనను సస్పెండ్ చేసేశారు. ఈ విషయంపై పూర్తి విచారణ జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు.
వివరాలలోకి వెళితే.. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫార్మాసిస్టు గ్రేడ్- 2గా పనిచేస్తున్న బత్తిని సత్యనారాయణగౌడ్.. ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాసరావుకు రూ.ఐదులక్షలు లంచంగా ఇవ్వాలనుకున్నాడు. అదేపనిగా ఆయన మొబైల్‌కే ఎస్‌ఎంఎస్ పంపించాడు. ‘సర్.. మీకో విన్నపం. ఎంఎస్‌డబ్ల్యూ(మెడికల్ సోషల్ వర్కర్) పదోన్నతులపరంగా ఎవరికైతే అన్యాయం జరిగిందో, వారిద్దరికి మాత్రమే మీరు చొరవ తీసుకొని అవి ఇస్తే రూ.5లక్షలు నేను మీకు ఏర్పాటు చేస్తాను సర్. ఎవరినీ నమ్మలేక, తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని నేరుగా అడుగుతున్నాను. అన్యధా భావించవద్దు. ఎన్నికల నియమావళి అమల్లోకి రానుందని, తర్వాత ఎవరైనా సీనియర్లు వస్తే..పదోన్నతి తమదాకా రాదని భయపడుతున్నారు’ అని సత్యనారాయణగౌడ్ మూడు సంక్షిప్త సందేశాలిచ్చేశాడు!
అయితే ఇది జరిగిన వెంటనే, ఉన్నతాధికారుల ఆదేశాలతో సత్వరమే అతడి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీఅయ్యాయి. ‘ప్రజారోగ్య విభాగంలో అవినీతిని అరికట్టడానికి పలు చర్యలు తీసుకుంటున్నాం. కొందరు పదేపదే అదేబాటలో నడుస్తున్నారు. అలాంటి పనుల్ని ఏమాత్రం ఉపేక్షించేది లేదు. శాఖపరంగా సమగ్ర విచారణ చేపడతాం. అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదిస్తాం’ అని డీహెచ్ ప్రకటించారు.
రొమాంటిక్ సినిమాలంటే చాలా ఇష్టం : నమిత హాట్ కామెంట్స్