telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఐఏఎస్ చంద్రకళ ఇంటిపై సీబీఐ దాడులు!

CBI Rides IAS Officer Chandrakala

తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారిణి చంద్రకళ ఇంటిపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ లో ఇసుక కుంభకోణం వ్యవహారంలో కేసు నమోదుచేసిన అధికారులు ఈరోజు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇసుక మాఫియాతో కలిసి శశికళ అవకతవకలకు పాల్పడినట్లు అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తెలంగాణలోని కరీంనగర్ తో పాటు యూపీలోని 12 చోట్ల ఏకకాలంలో ఈ సోదాలు చేపట్టారు. హమీర్‌పూర్‌లోని బీఎస్పీ నేత సత్యదేవ్‌ దీక్షిత్‌, ఎస్పీ ఎమ్మెల్సీ రమేశ్‌ మిశ్రా ఇళ్లలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. 

కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గర్జనపల్లికి చెందిన చంద్రకళ 2008 లో సివిల్స్ సాధించారు. హమీర్‌పుర్‌, మధుర, బులంద్‌శహర్‌ జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేశారు. కలెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో రహదారి పనుల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులు, కాంట్రాక్టర్లకు చంద్రకళ క్లాస్ పీకిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా నాణ్యత లేకుండా పనులు చేసినందుకు 12 కాంట్రాక్టులను సైతం ఆమె రద్దు చేశారు. అత్యంత నిక్కచ్చిగా ఉండే అధికారిణిగా పేరు తెచ్చుకున్న చంద్రకళను ప్రధాని మోదీ స్వచ్ఛభారత్ మిషన్ డైరెక్టర్‌గా, కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ ఉప కార్యదర్శిగా నియమించారు. తాజాగా అలాంటి అధికారిణిపై సీబీఐ దాడులు చోటుచేసుకోవడం గమనార్హం.

Related posts