telugu navyamedia
రాజకీయ

తొలి ఆదివాసీ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ముప్రమాణం..

*పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో రాష్ట్రపతిగా ప్రమాణం చేయనున్న ద్రౌపది ముర్ము

*ప్రమాణం తర్వాత 21 గన్‌ సెల్యూట్‌ స్వీకరించనున్న ద్రౌపది ముర్ము

*ప్రమాణం అనంతరం నూతన రాష్ట్రపతిగా ముర్ము ప్రసంగిస్తారు.

శ్రీమతి ద్రౌపది ముర్ము భారతదేశ 15 వ రాష్ట్రపతిగా మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ముర్ము చేత ప్రమాణం చేయిస్తారు. పార్లమెంటు సెంట్రల్ హాలులో ఈ కార్యక్రమం జరగనుంది. అనంతరం సైనికుకలు ద్రౌపది ముర్మకు 21 గన్ సెల్యూట్ ను సమర్పిస్తారు. సైనిక వందనం స్వీకరించిన అనంతరం ఆమె జాతిని ఉద్దేశించి ప్రసంగం చేయ‌నున్నారు.

ప్రమాణస్వీకారం కార్యక్రమానికి ముందు పదవీ విరమణ చేయనున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపదీ ముర్ము ఊరేగింపుగా పార్లమెంటుకు చేరుకుంటారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర మంత్రిమండలి సభ్యులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, దౌత్య విభాగాల అధిపతులు, పార్లమెంటు సభ్యులు, పౌర, మిలటరీ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

కాగా దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవికి ఎన్నికైన తొలి గిరిజన నాయకురాలిగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపడుతున్న రెండో  మహిళగా కూడా నిలవనున్నారు.

ముర్ము 2015 నుంచి 2021 వరకు జార్ఖండ్‌ గవర్నర్‌గా పని చేశారు. తాజా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేసి, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాపై భారీ మెజారిటీతో గెలిచారు.

ముర్ము ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లా, బైదాపోసి గ్రామంలో గిరిజన తెగకు చెందిన సంతాల్‌ కుటుంబంలో 1958 జూన్‌ 20 న జన్మించారు. భువనేశ్వర్‌ లోని రమాదేవి మహిళా కాలేజీ నుంచి బీఏ పూర్తి చేసి ఆ తర్వాత ఉపాధ్యాయురాలిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1977–83 మధ్య ఒడిశాలోని నీటిపారుదల శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా, 1994 నుంచి 97 వరకూ శ్రీ అరబిందో ఇంటెగ్రల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో గౌరవ సహాయ ఉపాధ్యాయురాలిగా ఉన్నారు.

ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆమె కుటుంబం నుంచి కేవలం నలుగురు మాత్రమే హాజరు కానున్నారు. ద్రౌపది ముర్ము సోదరుడు, వదినతో పాటు కూతురు, అల్లుడు ఈ కార్యక్రమానికి హాజరవుతారు.

Related posts