కరోనా కల్లోలం వేళ కొందరు అధికారులు ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటున్నట్టు వస్తున్న ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర స్థాయిలో స్పందించింది. స్థానిక, రాష్ట్ర, కేంద్ర అధికారుల్లో ఎవరైనా ఆక్సిజన్ తరలింపునుగానీ, సరఫరాను గానీ అడ్డుకుంటే ‘‘ఆ వ్యక్తిని ఉరితీస్తాం’’ అంటూ హెచ్చరించింది. తీవ్ర అస్వస్థతకు గురైన కొవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ దొరకడం లేదంటూ మహారాజా అగ్రసేన్ ఆస్పత్రి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ విపిన్ సంఘి, జస్టిస్ రేఖా పల్లిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఆక్సిజన్ సరఫరాను ఎవరైనా అడ్డుకున్న ఒక్క సందర్భాన్ని తమ దృష్టికి తీసుకురావాలనీ.. అతడిని తాము ‘‘ఉరి తీస్తా’’మని కోర్టు పేర్కొంది. ‘‘ఈ విషయంలో ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు..’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటున్న అలాంటి అధికారులపై కేంద్రం చర్యలు తీసుకునేలా… వారి గురించి కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలపాలని ఢిల్లీ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.
previous post
జబర్దస్త్ కమెడియన్స్ అందరూ నాగబాబు వైపే ఉంటారు… ధన్ రాజ్ సంచలన కామెంట్స్