telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘పాన్ ఇండియా’కు కరోనా స్పీడ్ బ్రేకు….!

RRR

బాహుబలి… టాలీవుడ్ పయ నాన్ని పాన్ ఇండియా వైపు మళ్లించిన మూవీ. ఎంత ఖర్చు పెట్టినా అంతకు అంత వసూళ్లు సాధించవచ్చని నిరూపించిన చిత్రం. ఆ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో టాలీవుడ్ లో మరిన్ని పాన్ ఇండియా స్థాయి చిత్రాల నిర్మాణం ఆరంభమైంది. పాన్ ఇండియా సినిమాలకు ఇక టాలీవుడ్డే వేదిక అవుతుందనుకుంటున్న వేళ మహమ్మారి కరోనా ఇండస్ట్రీకి భారీ దెబ్బ వేసింది. లాక్ డౌన్ తో థియేటర్లు మూత పడ్డాయి. ఇక ఇప్పట్లో మళ్లీ తెరుచుకునే అవకాశం కూడా కనిపించడం లేదు. ఒకవేళ థియేటర్లు తెరిచినా మునుపటిలా సినిమాలకు ఆదరణ ఉంటుందో లేదో తెలియని స్థితి. ఈ పరిస్థితుల్లో ముందు ముందు భారీ స్థాయి సినిమాలు రూపుదిద్దుకుంటాయా.

లేదా అనేది సందిగ్ధంగా మారింది. సినిమా షూటింగులకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతించినా… కరోనా తీవ్రతతో నిర్మాణాలు మొదలుపెట్టలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్నంతగా మరే భాషలోనూ భారీ సినిమాలు తీయడం లేదు. కన్నడలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా కేజీ ఎఫ్-2 రూపుదిద్దుకుంటుండగా, తమిళంలో మణిరత్నం విక్రమ్, జయం రవి కాంబినేషన్లో ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. బాలీవుడ్లో కూడా కొన్ని సినిమాలు లైన్లో ఉన్నా ఇంకా అవి ప్లానింగ్ దశలోనే ఉన్నాయి. సెట్స్ పై పెద్ద సినిమా ఏదీ లేదు. టాలీవుడ్లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. స్టార్ హీరోలందరూ తమ సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో నిర్మించడానికి ఆసక్తి చూపుతుండటంతో ఆ కేటగిరి సినిమాల నిర్మాణం పెరిగింది. ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా సుమారు రూ.400 కోట్లతో నిర్మిస్తున్నారు. ప్రభాస్ హీరోగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్ చిత్రాన్ని రూ.250 కోట్లతో తీ స్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ తెరకెక్కిస్తున్న మూవీ కూడా భారీ బడ్జెట్ తోనే రూపొందుతోంది.

ఇవి కాకుండా ఇంకా రానా అరణ్య, చిరంజీవి- కొరటాల శివ ఆచార్య, సుకుమార్, అల్లు అర్జున్ పుష్ప, విష్ణు మోసగాళ్లు, మనోజ్ అహంబ్రహ్మాస్వి, పూరీ-విజయ్ దేవరకొండ ఫైటర్, నిఖిల్ కార్తికేయ-2, రానా-గుణశేఖర్ హిరణ్యకశిప పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. తాజాగా ఆది సాయికుమార్ కూడా ఓ మూవీ స్టార్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు.ఇంకా షూటింగ్ ప్రారంభం కాని మహేష్ -రాజమౌళి, ఎన్టీఆర్ -ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ -త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలను పాన్ ఇండియా కేటగిరిలోనే నిర్మించాలనుకుంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రానున్న సినిమా మరో ఎత్తు. ఈ మూవీని రూ.400 కోట్ల బడ్జెట్ తో పాన్ వరల్డ్ స్థాయిలో నిర్మిస్తామని నాగ్ అశ్విన్ ప్రకటించారు. ఇన్నేసి భారీ సినిమాలు తెలుగులో తప్ప మరెక్కడా నిర్మాణంలో లేవు. కరోనా తీవ్రత తగ్గి పరిస్థితి మునుపటి స్థాయికి చేరితే టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలకు వేదిక అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

Related posts