యూపీపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలకు రంగం సిద్ధమైంది. జూన్ 2న హైదరాబాద్ సహా వరంగల్ పట్టణాల్లో పరీక్షను నిర్వహించనున్నారు. ఇందుకోసం హైదరాబాద్ జిల్లాలో 103 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, మొత్తం 49,033 మంది అభ్యర్థులు హాజరుకాబోతున్నారు. ఈ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్, పరీక్షల కో ఆర్డినేటింగ్ సూపర్‌వైజర్ మాణిక్‌రాజ్ కన్నన్ గురువారం నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో సమీక్ష నిర్వహించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
కలెక్టర్ ప్రిలిమినరీ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణ కోసం 36 మంది రూట్ ఆఫీసర్లు, ఆరుగురు ఎగ్జామినేషన్ అబ్జర్వర్లు, ఏడుగురిని అదనంగా నియమించామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద లోకల్ ఇన్‌స్పెక్టింగ్ అధికారులు, సూపర్‌వైజర్లు ఉంటారని, అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే ఉన్నతాధికారులకు సమాచారమందించాలన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్ గుగులోతు రవి, జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీ భూపాల్‌రెడ్డి, పరిశీలకులు హైమావతి, సిక్తా పట్నాయక్ సహా ఇతర అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
ఈ పరీక్ష రెండు దఫాలుగా జరుగనుంది. ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థికి జారీ అయిన అడ్మిట్ కార్డ్డులో ఏ సెంటర్ పేరు ఉంటే అదే సెంటర్‌లో పరీక్ష రాయాల్సి ఉంటుంది. మరో సెంటర్‌లో పరీక్ష రాయడానికి అవకాశం లేదు. యూపీఎస్సీ జారీ చేసిన అడ్మిట్ కార్డ్‌తోనే పరీక్షకు హాజరుకావాలి. ఇతరాత్ర ఎలాంటి పత్రాలను అనుమతించరు. బ్లాక్ బాల్‌పెన్‌తోనే పరీక్ష రాయాల్సి ఉంటుంది. అభ్యర్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలను చేరుకోవాలని కలెక్టర్ మాణిక్‌రాజ్ కన్నన్ అభ్యర్థులకు సూచించారు.
అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామన్నారు. ఎలాంటి సాంకేతిక పరికరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించమని, హైటెక్ కాపియింగ్‌ను నిరోధించేందుకు అన్ని పరీక్షా కేంద్రాల్లో జామర్లను అమర్చి పకడ్బందీగా నిర్వహించనున్నామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులను, ఇన్విజిలేటర్లను, సీటింగ్ అరెంజ్‌మెంట్స్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూపర్‌వైజర్లను ఆదేశించారు. పరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని సూచించారు.