telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

గ్రేటర్ లో ఉనికి కోల్పోయిన ఆ పార్టీలు…

గ్రేటర్ ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. అటు కాంగ్రెస్‌ గత ఎన్నికల్లాగే రెండు స్థానాలకే పరిమితమైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎక్కడా డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. టీడీపీ ఈసారి ఒంటరిగా 106 స్థానాల్లో పోటీ చేసింది. అయితే ఎక్కడా టీడీపీ అభ్యర్థులకు కనీస స్థాయిలో కూడా ఓట్లు పడలేదు. తమకు బలం ఉందని భావిస్తున్న కూకట్ పల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. గ్రేటర్ లో వందకు పైగా డివిజన్లలో టిడిపి పోటీ చేసినా, ప్రచారానికి  మాత్రం అంటు చంద్రబాబునాయుడు కానీ, లోకేష్ కానీ రాలేదు.  చివరకు చంద్రబాబు నాయుడు ట్విటర్ ద్వారా ప్రచారం చేసి పెట్టారు. యథాతథంగా హైదరాబాద్ ను డెవలప్ చేసింది తనేనని రొటీన్ డైలాగ్ చెప్పుకున్నారు. అయితే గ్రేటర్ ఫలితాల్లో టీడీపీ అడ్రస్ గల్లంతయ్యింది. ఆఖరికి తెలుగుదేశం అనుకూల సామాజికవర్గం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా పసుపు జండాకు ఓట్లు పడలేదు. ఇక సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఈసారి కూడా ఘోర పరాభవం తప్పలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైనప్పటి నుంచి జరుగుతున్న ఎన్నికల్లో ఆ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. టియ్యారెస్‌ కు తామే ప్రత్యామ్నాయమని కాంగ్రెస్ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నా, ఓటర్లు మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఒకప్పుడు గ్రేటర్ పీఠాన్ని ఏలిన కాంగ్రెస్.. తాజాగా ఎన్నికల్లోనూ కేవలం రెండు స్థానాలకే పరిమితమైపోయింది. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. కేవలం పటాన్‌ చెరు, నాచారంలో మాత్రమే గెలిచింది. ఈసారి ఏ పార్టీతో పొత్తులేకుండా రంగంలోకి దూకిన కాంగ్రెస్.. మొత్తం 146 చోట్ల అభ్యర్థులను దింపి మళ్లీ రెండు కేవలం స్థానాలే గెలుచుకోగలిగింది. పాత స్థానాల్లో ఓడి కొత్తగా ఏఎస్‌ రావు నగర్, ఉప్పల్ డివిజన్లలో గెలిచింది. తెలంగాణలో టియ్యారెస్ కు తామే పోటీ అని చెప్పుకుంటున్నా, ఆ స్థానంలోకి బిజెపి వచ్చి చేరిందని ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ హామీలు నగర ఓటర్లను ఆకట్టుకోలేకపోయాయి. హైదరాబాద్ అభివృద్ధిలో తమ పార్టీదే కీలక పాత్ర అని, కారు కమలంపా దొందూదొందే అంటూ చేసిన ప్రచారాన్ని కూడా ఓటరు పట్టించుకోలేదు. ఎన్నికల ప్రచారంలో టియ్యారెస్, బిజెపి అగ్రనేతలు ప్రచారంలో వేడిపుట్టించారు. కాంగ్రెస్ మాత్రం ఆ స్థాయిలో ప్రచారం నిర్వహించడంలో విఫలమైంది.

Related posts