*మత పిచ్చిగాళ్లు ఎలాంటి దుర్మార్గాలను సాగనివ్వం
*మత పిచ్చికి లోనైతే…బతుకులు ఆగమౌతాయి
*స్వార్థ మతపిచ్చిగాళ్లను తరమికొట్టాలి
*మోదీ….మేము మనుషులం కాదా? దేశంలో భాగం కాదా?
*కేంద్రం నుంచి మోదీ ప్రభుత్వాన్ని పారద్రోలితేనే మనం అన్ని రంగాల్లో బాగుపడతాం
*జాతీయ రాజకీయాల్లో ఉజ్వల పాత్ర నిర్వహిస్తాం
*నా ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ ను ఆగం కానివ్వను
*నా బలగం బలం ప్రజలే..
*పంటల తెలంగాణ కావాలా? మంటల తెలంగాణ కావాలా? మీరే తేల్చుకోండి..?
నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణను ఆగం కానివ్వను అని , తెలంగాణను కాపాడటానికి సర్వశక్తులను దారపోస్తా అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తనకు బలం బలగం.. ప్రజలేనని అభిప్రాయపడ్డారు. వారి ఆశీస్సులు ఉన్నంత వరకు దూసుకుపోతుంటాను అని తెలిపారు. మత పిచ్చికి లోనైతే మళ్లీ పాత తెలంగాణ వస్తుందని హెచ్చరించారు. చిన్న నిర్లక్ష్యం కారణంగా 58 ఏళ్లు తెలంగాణ పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు
రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ ..ఎనిమిదేళ్ల నుంచి తెలంగాణలో చీమ చిటుక్కుమన్న సంఘటన లేదని… ఇప్పుడు మాత్రం చిచ్చు రేపే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. తెలంగాణ ప్రశాంతంగా ఉంటూ అభివృద్ధిలో దూసుకెళ్తుందని గుర్తు చేశారు. అలాంటి తెలంగాణలో ఈ మతపిచ్చిగాళ్లు ఏం చేస్తున్నారో చూడాలన్నారు. ఎలాంటి దుర్మార్గమైన పద్దతుల్లో వెళ్తున్నారో గమనించాలని సూచించారు.
తెలంగాణలో చిన్న, సన్నకారు రైతులే అధికమన్నారు. తెలంగాణ లో అద్బుతమైన రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రైతుబంధు, రైతుబీమా పథకాలు ఏ రాష్ట్రంలో లేవని తెలిపారు.
రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణేనని తెలిపారు. పాత నీటి తీరువా బకాయిలు రద్దు చేసి ఉచితంగా నీరు అందించామని పేర్కొన్నారు. ఉచితంగా నీరు, కరెంట్ అందించామని, రైతుల బకాయిలు రద్దు చేశామని గుర్తుచేశారు.
పంట కొనుగోలు చేసి బిల్లులు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఇంత అద్బుతమైనా పాలనను తెలంగాణ అందిస్తుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలలో కూడా ఇలా జరుగుతుందని మనం అనుకున్నామా? అని ప్రశ్నించారు.
బంగారు పంటలు పండే తెలంగాణ కావాలా, మత పిచ్చితో మంటలు రేగే తెలంగాణ కావాలా, ప్రజలే తేల్చుకోమన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. మంటలు మండే తెలంగాణ అయితే తెలంగాణ దెబ్బతింటుందని కేసీఆర్ చెప్పారు.
ఇంకా ఏ దురాశతో దేశాన్ని ఆగం పట్టిస్తున్నారో చెప్పాలని మోదీని నిలదీశారు. మోదీకి ఇంకా ఏంకావాలో చెప్పాలన్నారు. ఉన్న ప్రధానమంత్రి పదవి కంటే పెద్ద పదవి ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. బిహార్‌లో ఏం జరుగుతోంది.. దిల్లీలో ఏం జరుగుతోంది. బెంగాల్‌లో ఏం జరుగుతుంది. తెలంగాణలో ఎలాంటి కారుకూతలు కూస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారని అన్నారు..